Southeast Monsoon: అధిక ఉష్ణోగ్రతలు.. ఉక్కపోత.. వడగాలులతో ఉక్కిరి బిక్కి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. ఈనెల 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్న్రేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది.
ద్రోణి ప్రభావంతో వర్షాలు..
ఇదిలా ఉండగా దక్షిణ కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగలతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం(మే 14న) వడగాలుల ప్రభావం ఉండదని పేర్కొంది.
ఈ జిల్లాల్లో పిడుగుల వాన..
ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. రాయలసీమలో జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, సత్యసాయి, బాపట్ల, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, నంద్యాల, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లా బల్లిపల్లిలో అత్యధికంగా 79 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం లభించింది.