
Heritage Well : సికింద్రాబాద్‌లోని మౌలా అలీలోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ZRTI) వద్ద ఉన్న 200 ఏళ్ల నాటి వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనమైన మెట్ల బావిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. రైల్వే మంత్రిత్వ శాఖ పరిరక్షణ – పునరుద్ధరణకు ప్రాధాన్యతనిచ్చింది. చారిత్రక సంపదను కాపాడుకోవడంతోపాటు నీటి వనరుల కోసం ఈ ప్రాజెక్ట్ చేపట్టింది.
దాదాపు 50 అడుగుల లోతు ఉన్న బావి పునరుద్ధరణకు రూ.6 లక్షలతో పనులు చేపట్టారు. ఈ బావిలోంచి రోజుకు లక్ష లీటర్ల నీరు వస్తుంది.
దక్షిణ మధ్య రైల్వే ప్రకారం.. ఈ బావిని స్వాతంత్య్రానికి పూర్వం నాటి నిజాం ప్రధానిగా ఉన్న సర్ మీర్ తురాబ్ అలీ ఖాన్.. సాలార్ జంగ్-Iలోని మామిడి తోటలకు సాగునీరు అందించడానికి ఉపయోగించారు. తోటకు నీరందించే బాధ్యతను సిబ్బందికి అప్పగించి బావి వెంట పది గదులు కూడా నిర్మించారు.
1966లో దక్షిణ మధ్య రైల్వే బావిని వారసత్వంగా పొందింది. గత ఐదు దశాబ్దాలుగా ఇది శిక్షణా సంస్థ యొక్క నీటి అవసరాలను తీరుస్తోందని రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ పునరుద్ధరించబడిన హెరిటేజ్ బావి శిక్షణా కేంద్రం -ప్రాదేశిక క్యాంపు కార్యాలయం వంటి చుట్టుపక్కల కార్యాలయాల యొక్క అన్ని గృహ నీటి అవసరాలను తగినంతగా తీరుస్తోంది. నెలకు దాదాపు రూ.5 లక్షలు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేశారు.
బావిని ఇప్పుడు నైలాన్ మెష్‌తో కప్పి, నీటిని శుభ్రంగా ఉంచడానికి.. దానిలో ఆకులు.. ఇతర పదార్థాలు పడకుండా నిరోధించారు. కలుషితం కాని నీటిని సరఫరా చేసేందుకు మాన్యువల్ క్లోరినేషన్ కూడా చేస్తున్నారు.
2016లో మౌలా అలీలోని సాలార్‌జంగ్ బావి తర్వాత దక్షిణమధ్య రైల్వే పునరుద్ధరించబడిన రెండవ బావి ఇది. మొత్తంగా వారసత్వంగా వచ్చిన 200 ఏళ్ల నాటి బావిని ఇలా పునరుద్దరించడంపై చరిత్రకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Restoring Heritage!
SCR Revives #HeritageWell
@ Zonal Rly Trg Institute,Sec'bad🔷It is a step-well which is 200 yrs old.
🔷The well yields around 1 lakh ltrs of water per day
🔷 Revived In tune with the emphasis laid by Ministry of Rlys towards conservation of water pic.twitter.com/mUQYTiBS2f— South Central Railway (@SCRailwayIndia) February 23, 2023