ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతలే మిన్న అంటారు. ఇతరులకు సాయం చేయడంలో సోనూసూద్ ను మించిన వారు ఎవరూ లేరు. సినీ జీవితంలో ప్రతినాయకుడిగా పాత్రలు పోషించినా నిజజీవితంలో నాయకుడిగా గుర్తింపు పొందారు. రియల్ హీరోగా మారుతున్నాడు. ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తూ తనలోని దాతృత్వాన్ని చాటుతున్నాడు. అవసరమొస్తే ప్రభుత్వాన్ని అడగడం మానేసి సోనూసూద్ నే అడుగుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు కావాలన్నా సోనూసూద్ నే అడగడంతో ఆయన జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఏర్పాటు చేస్తున్నారు.
మొదటి విడత లాక్ డౌన్ లో దిక్కుతోచని స్థతిలో ఉన్న వారికి సాయం అందజేశాడు. సొంతూళ్లకు వెళ్లలేని వారికి డబ్బులు ఇచ్చి గమ్య స్థానాలకు చేర్చడంలో ఎన్నో రకాలుగా సాయం చేశాడు. ప్రస్తుతం ప్రభుత్వాలు చేయలేని పనులు చేస్తూ వారిలో భరోసా కల్పిస్తున్నాడు. సోనూసూద్ చేస్తున్న సేవల్ని అందరూ ప్రశంసిస్తున్నారు. పేద వారిని ఆదుకోవడంలో తనదైన శైలిలో సేవ చేయడం ఆహ్వానించదగినదే.
సోనూసూద్ కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత మందిని ఎలా ఆదుకుంటున్నాడు? అంటే ఆయన ఓ ఆంగ్ల టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఈ సేవా కార్యక్రమాల్లో కొంత మంది తనకు తోడుగా ఉన్నారని పేర్కొన్నాడు. వారిచ్చే విరాళాలతో సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నామని వివరించాడు. తాము చేసే కార్యక్రమాలు చూసి చాలా మంది స్ఫూర్తి పొందారని గుర్తు చేశారు.
సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేస్తున్నామన్నారు. మా సాయంతో ప్రాణాలు నిలబెట్టుకున్న వాళ్ల స్పందన చూశాక ఎంతో సంతోషం ఉంటుందని చె ప్పారు. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి కోసం భారీ ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నాడు. కంపెనీల భాగస్వామ్యంతో ఇప్పటికే 2 లక్షల మందికి ఉపాధి కల్పించామని సో నూసూద్ చెప్పాడు.