Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారింది. పార్టీని కొద్ది రోజుల్లో ప్రజలు మరిచిపోయే స్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ రాష్ట్రానికి చెందిన 36 మంది నేతలతో సమావేశం అయ్యారు. తెలంగాణలో రాజకీయ వ్యూహకర్తగా సునీల్ కనుగోలు పార్టీ పరిస్థితిని అధినేతకు వివరించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా వివరించారు. భవిష్యత్ లో చేపట్టబోయే కార్యక్రమాల గురించి అన్ని కోణాల్లో వివరాలు వెల్లడించారు.
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తరువాత సీనియర్లు అసమ్మతి గళం వినిపించడంతో పార్టీ ముందుకు పోని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కూడా కొందరు సీనియర్లు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కానీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అసమ్మతి నేతలు వెనుదిరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పై వారంతా ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో తెలియడం లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలతో నిర్వీర్యం అవుతోంది. సీనియర్ నేత వీహెచ్ సోనియాగాంధీతో సమావేశమయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సైతం సోనియాగాంధీతో జన్ పథ్ లో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వీరు సోనియాతో ఏం చర్చించారనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
పీకే తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యూహాలు అందిస్తుండటంతో బీజేపీ గులాబీ పార్టీపైనే ఫోకస్ పెడుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రజలు మరిచిపోయే ప్రమాదం ఉందని నేతల మధ్య చర్చ సాగినట్లు చెబుతున్నారు. పార్టీ సంస్థాగత మార్పుల కోసం నడుం బిగించాల్సిన అవసరం వచ్చిందని వారి మధ్య చర్చ జరిగింది. రాహుల్ గాంధీ సూచన మేరకు రాష్ట్రంలో అందరు కలిసి నడవాల్సిన సమయం ఆసన్నమైందని సూచిస్తున్నారు.