Congress: దేశాన్ని కొన్ని దశాబ్ధాల పాటు గుప్పిట పట్టిన కాంగ్రెస్ కు ఇప్పుడు నాయకత్వ సమస్య పెను సమస్యగా మారింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి కాంగ్రెస్ ఓడిపోయాక అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ త్యజించాడు. సీనియర్లను పక్కనపెట్టి పార్టీకి జవసత్వాలు నింపేందుకు ఉడుకునెత్తురు యువకులకు బాధ్యతలు అప్పగిస్తేనే తాను మళ్లీ అధ్యక్షుడిగా కొనసాగుతానని అంటున్నాడు. దీంతో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతున్నారు.

బీజేపీ రెండు సార్లు అప్రతిహతంగా గెలవడం.. కాంగ్రెస్ పని అయిపోతున్న వేళ అధ్యక్ష బాధ్యతలను ఈ వృద్ధాప్యంలోనూ సోనియాగాంధీ నెత్తిన పెట్టుకొని ఆపసోపాలు పడుతోంది. అటు కొడుకు రాహుల్ గాంధీని ఒప్పించలేక.. ఇటు సీనియర్లను మెప్పించలేక.. దేశ ప్రజల అభిమానం చూరగొనలేక ఆపసోపాలు పడుతోంది.
ఈ క్రమంలోనే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న ఒత్తిడి రాహుల్ గాంధీపై వస్తోంది. అయితే ఆయన కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయనిదే గద్దెనెక్కను అంటున్నాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఇంకా ఎంత కాలం సోనియా ఉంటుంది? ఆమెకు ఈ వయోభారం తప్పదా అనుకుంటున్న వేళ సోనియగాంధీ కీలక ప్రకటన చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు సోనియా తెరదించారు. తానే పూర్తి స్థాయి అధ్యక్షురాలిని అని స్పష్టం చేశారు. పార్టీని ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాల్సి ఉందని బహిరంగంగా అసమ్మతి తెలియజేస్తోన్న జీ23 నేతల విమర్శలకు ఆమె చెక్ పెట్టారు. దీంతో కాంగ్రెస్ సీనియర్లకు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు కావాలన్న వారి డిమాండ్ నెరవేరకుండా పోయింది.
శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలో హాట్ హాట్ గా సాగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక, లఖింపూర్ ఘటన, పలు రాష్ట్రాలకు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు తదితర అంశాలే ఎజెండాగా సాగింది. ఈ సందర్భంగా సోనియా ప్రారంభ ఉపన్యాసం చేశారు. దేశంలో నెలకొన్న తాజాగా పరిస్థితులపై చర్చించారు.