ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి 2021–-22 బడ్జెట్‌లో సవరించి ప్రతిపాదించిన విధానం మొత్తం కేంద్ర సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరించే దిశలో వుంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌యు)లో వాటాల ఉపసంహరణ మాత్రమే కాదు, అచ్చమైన ప్రైవేటీకరణ ప్రక్రియ ఇది. పీవీ నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఈ వాటాల ఉపసంహరణ కార్యక్రమం మొదలెట్టింది. వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక ఈ పెట్టుబడుల ఉపసంహరణను పచ్చి ప్రైవేటీకరణగా మొండిగా కొనసాగించింది. ఎంతవరకూ వెళ్లారంటే పెట్టుబడుల ఉపసంహరణకు ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటుచేశారు. పెట్టుబడుల ఉపసంహరణతో పాటు వాజ్‌పేయి ప్రభుత్వం డజనుకు పైగా సీపీఎస్‌యులను నూటికి నూరుపాళ్లు తెగనమ్మింది.
అయితే.. ఈ ప్రైవేటీకరణలపై తాజాగా ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న ఆలోచన ముందుగా కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్టాడారు. ఈ కార్యక్రమంలో పార్టీరాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొనగా.. సోము పార్టీ జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ పలు సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. ‘బీజేపీ వచ్చాకే దేశంలో అవినీతిని అరికట్టాం. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ కుంభకోణాలకు పాల్పడిన అవినీతి పరులను జైళ్లకు పంపించాం. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న ఆలోచన చేసింది మొదట కాంగ్రెస్ పార్టీనే. రాష్ట్రంలో కచ్చితంగా అధికారంలోకి వస్తాం’ అని ఉద్ఘాటించారు.