
Ex-Telangana CS Somesh Kumar: తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ పదవిపై తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కన్నేశారు. హైకోర్టు చివాట్లు పెట్టడంతో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిన సోమేష్ కుమార్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ పెద్దగా దేక లేదు. ఏ పోస్ట్ లోనూ నియమించలేదు.. దీంతో మనసు నొచ్చుకున్న సోమేశ్ కుమార్ విఆర్ఎస్ తీసుకున్నారు. దీనికి జగన్ కూడా సమ్మతం తెలిపారు.. అక్కడ ఉంటే లాభం లేదనుకుని.. ఇన్నాళ్లు రాజభోగాలు అనుభవించిన తెలంగాణకు మళ్ళీ వచ్చారు. ఎంతైనా కెసిఆర్ తో వేవ్ లెంగ్త్ కుదిరింది కాబట్టి.. ఇక్కడే సెటిల్ కావాలని ఆలోచిస్తున్నారు. భాగంగానే తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు మూడుసార్లు ఆయన సీఎం కేసీఆర్ ను కలిసినట్టు తెలుస్తోంది.
నియమిస్తారా
ధరణి ద్వారా కొత్త సమస్యలు సృష్టించిన సోమేశ్ కుమార్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ కీలకమైన రెరా పోస్ట్ లో నియమిస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ది రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016 రూపొందించింది. దీని ప్రకారం అన్ని రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా రెరా ఏర్పాటుచేసి , 2018 ఆగస్టు నుంచి అమలులోకి తీసుకొచ్చింది. చట్టం ప్రకారం రెరా కు చైర్మన్, సభ్యులను నియమించాలి. వీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అదనపు కార్యదర్శి స్థాయిలో పనిచేసిన వారు అయి ఉండాలి.. కానీ ఇంతవరకు రెరా కు చైర్మన్, సభ్యులను నియమించలేదు.
అప్పట్లో రెండు పదవులు
2019 డిసెంబర్ 31న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయిన సోమేశ్ కుమార్.. రెరా చైర్మన్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు.. వీటితోపాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ధరణి, సీసీఎల్ఏ కమిషనర్… ఇలా ఏకకాలంలో 9 పోస్టుల బాధ్యతలు నిర్వర్తిస్తూ పరిపాలనలో చక్రం తిప్పారు. నిజానికి సోమేశ్ ఉన్నంతవరకు రెరా కు చైర్మన్, సభ్యులను పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. సోమేష్ ఏపీకి బదిలీ కావడంతో ప్రభుత్వం ఈ పదవులు భర్తీకి జనవరి 16న నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 17 వరకు గడువు విధించింది. ఈ నేపథ్యంలో సోమేశ్ కుమార్ తో పాటు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, సాగునీటిపారుదల సలహాదారు ఎస్కే జోషి, పురపాలక శాఖ కమిషనర్ సత్యనారాయణ దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సత్యనారాయణ ఫిబ్రవరి నెలాఖరుకు పదవి విరమణ చేయబోతున్నారు.. పదవి తనకే ఇవ్వాలంటూ సోమేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితులు కావడంతో అటు నుంచి నరుక్కొస్తున్నారు.

రియల్ ఎస్టేట్ ప్రముఖులతో లాబీయింగ్
చైర్మన్ పోస్ట్ కు అవసరమైన అర్బన్ డెవలప్మెంట్ అంశంలో తనకు అపారమైన అనుభవం ఉందని, ఇదివరకు ఇన్ ఛార్జ్ బాధ్యతలు కూడా నిర్వర్తించానని, వీటిని పరిగణలోకి తీసుకొని తనను చైర్మన్గా నియమించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.. రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ప్రగతి పథంలో నడిపిస్తానని, తద్వారా ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్లు పెంచి ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చి పెడతానని చెబుతున్నట్టు సమాచారం. ఇదే సమయంలో, తనకు తెలిసిన రియల్ ఎస్టేట్ ప్రముఖులతో లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. సోమేష్ లాంటి అనుకూల వ్యక్తి ఉంటే తమకు ఏ ఇబ్బంది ఉండదు అన్న కారణంతో రియల్ ఎస్టేట్ ప్రముఖులు ఆయనకు మద్దతు ఇస్తున్నట్టు చర్చ జరుగుతుంది. అయితే సోమేశ్ పై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.. ప్రభుత్వ పాలనలో బిహారి ఐఏఎస్ ల పాత్ర ఎక్కువైందని మండిపడుతున్నాయి.
