Telangana Elections 2023: మీడియా “గులాబీ” ధర్మం.. మీరు చూపకుంటే జనం తెలుసుకోలేరా?

సాధారణంగా వార్తను వార్తలాగా చూపించాలి. అలాగాకుండా కేవలం తమ ప్రయోజనాలకు అనుగుణంగా వార్తను చూపిస్తే అది మీడియా ధర్మం అనిపించుకోదు. కానీ తెలుగు నాట నెంబర్ వన్, నంబర్ టు స్థానాల్లో కొనసాగుతున్న కొన్ని మీడియా సంస్థలు నిన్న ఎగ్జిట్ పోల్స్ ప్రసారంలో చాలావరకు గులాబీ భక్తిని ప్రదర్శించాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : December 1, 2023 8:29 am

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: తెలంగాణలో పోలింగ్ ముగిసింది. వెంటనే ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తాము చేసిన సర్వే ఆధారంగా వచ్చిన వివరాలను బయటపెట్టేశాయి. ఒకటి అరా సంస్థలు మినహా మిగతావన్నీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేశాయి. సాధారణంగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఏం చెబుతాయి అనే దానిమీద చాలామందికి ఒక ఆత్రుత ఉంటుంది. తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ తెలుగు నాటవున్న కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఆ ఎగ్జిట్ పోల్స్ ను ప్రసారం చేయడానికి ఒప్పుకోలేదు. పైగా అందులోనూ గోప్యత పాటించాయి. కేవలం గులాబీ పార్టీకి మాత్రమే అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ను ప్రసారం చేశాయి.

ఇదేం మీడియా ధర్మం?

సాధారణంగా వార్తను వార్తలాగా చూపించాలి. అలాగాకుండా కేవలం తమ ప్రయోజనాలకు అనుగుణంగా వార్తను చూపిస్తే అది మీడియా ధర్మం అనిపించుకోదు. కానీ తెలుగు నాట నెంబర్ వన్, నంబర్ టు స్థానాల్లో కొనసాగుతున్న కొన్ని మీడియా సంస్థలు నిన్న ఎగ్జిట్ పోల్స్ ప్రసారంలో చాలావరకు గులాబీ భక్తిని ప్రదర్శించాయి. ఈ చానల్స్ లో కెసిఆర్ కు అత్యంత ఇష్టమైన వ్యక్తుల పెట్టుబడులు ఉండటం.. సహజంగానే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎగ్జిట్ పోల్స్ రావడంతో ప్రసారం చేయలేదని తెలుస్తోంది. అయితే ఆ చానల్స్ తెలుసుకొని విషయం ఏంటంటే.. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో ఏదీ ఆగడం లేదు. మరేదీ దాగడం లేదు.. అలాంటప్పుడు ఈ మీడియా సంస్థలకు ఉన్న క్రెడిబిలిటీ ఎంత అనేది వాటి యాజమాన్యాలు ఆలోచించుకోవాలి. ఒక టీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ ను ప్రసారం చేయలేదంటే అందులో ఒక అర్థం ఉంది.. ఎందుకంటే టీ న్యూస్ కేవలం భారత రాష్ట్ర సమితి మౌత్ పీస్ గా పని చేస్తుంది.. కానీ తెలుగు నాట మొదటి రెండు స్థానాల్లో ఉన్న చానల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేయకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అది నుంచి అంతే..

ఇక తెలంగాణలో ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఈ రెండు చానల్స్ ఒకరకంగా కాంగ్రెస్ పార్టీపై కక్షగట్టాయి. కేవలం భారత రాష్ట్ర సమితి నాయకుల మీద మాత్రమే ఫోకస్ పెట్టాయి. కేటీఆర్ తో ఇంటర్వ్యూ లకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాయి. ఎప్పుడైతే జనం మూడ్ మారుతోంది అని తెలిసిందో అప్పుడు కలలో నుంచి నిజం లోకి వచ్చాయి. రేవంత్ రెడ్డికి ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టాయి.. కానీ ఎగ్జిట్ పోల్స్ విషయంలోనూ ఇదే చొరవను ప్రదర్శించలేకపోయాయి. అయితే కేవలం ఎగ్జిట్ పోల్స్ విషయంలోనే ఇలా ఉంటే.. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలా వ్యవహరిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.