https://oktelugu.com/

KCR: కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతాడా?

కెసిఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి లో కూడా పోటీ చేశారు. అయితే అక్కడ కామారెడ్డిలో స్థానికుడైన వెంకటరమణ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశారు. అక్కడ ఆయన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : December 1, 2023 / 08:57 AM IST

    KCR

    Follow us on

    KCR: మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల క్రతువు ముగిసినట్టే. కొన్నిచోట్ల మినహా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ దాదాపుగా ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఫలితం ఏమిటో చెప్పేశాయి. అయితే చాలా వరకు ఎగ్జిట్ పోల్ సంస్థలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేశాయి. ఒకటి రెండు సంస్థలు మాత్రం భారత రాష్ట్ర సమితి అధికారాన్ని తిరిగి దక్కించుకుంటుందని స్పష్టం చేశాయి. చాలావరకు ఎగ్జిట్ పోల్ సంస్థలు వాస్తవానికి దగ్గరగానే సర్వే చేస్తుంటాయి. కొన్నిసార్లు మాత్రమే విఫలమవుతూ ఉంటాయి. ఎలాగూ సర్వే సంస్థలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి కాబట్టి సహజంగానే భారత రాష్ట్ర సమితి క్యాడర్ లో ఒకింత నిర్వేదం అలముకుంది. కేటీఆర్ అప్పటికప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించినప్పటికీ అది పెద్దగా ప్రయోజనం కలిగించలేదు. పైగా కేటీఆర్ విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆగ్రహంతోనే సమాధానం చెప్పారు. ఇది ఇలా ఉండగా భారత రాష్ట్ర సమితి కార్యవర్గంలో కేసీఆర్ ఓటమి ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది.

    ఓటమి తప్పదా

    కెసిఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి లో కూడా పోటీ చేశారు. అయితే అక్కడ కామారెడ్డిలో స్థానికుడైన వెంకటరమణ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశారు. అక్కడ ఆయన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి అక్కడ ఓడిపోతారని తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన అంచనాల మేరకు కెసిఆర్ అక్కడ రెండవ స్థానానికి పరిమితం అవుతారని తెలుస్తోంది. కెసిఆర్ తన రాజకీయ జీవితం ప్రారంభించిన తొలినాళ్లలో మదన్మోహన్ చేతిలో ఓటమికి గురయ్యారు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఓటమి అనేది తెలియకుండానే తన రాజకీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే తాజాగా కామారెడ్డిలో ఆయన ఓడిపోతారని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు చెప్పడంతో భారత రాష్ట్ర సమితి నాయకులు ఒక్కసారిగా డీలా పడిపోయారు.

    గజ్వేల్ లో సైతం

    ఇక ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న గజ్వేల్ లో కూడా పరిస్థితి ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఆయనకు భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందర్ గట్టి పోటీ ఇస్తున్నారు. అక్కడ జరిగిన పోలింగ్ విధానాన్ని బట్టి చూస్తే అనూహ్యమైన ఫలితం రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొన్ని సంస్థలు మాత్రం అక్కడ కెసిఆర్ స్వల్ప మెజారిటీతో గెలుస్తారని చెబుతున్నాయి. అయితే గజ్వేల్ లో సమస్యలు, మల్లన్న సాగర్ ముంపు బాధితుల ఇబ్బందులను తెరపైకి తీసుకురావడంలో ఈటల రాజేందర్ సఫలీకృతులయ్యారని, పోల్ మేనేజ్మెంట్ లోనూ ఆయన చాకచక్యంగా వ్యవహరించారని తెలుస్తోంది. అందువల్లే గజ్వేల్ లో కూడా కెసిఆర్ తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం, కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతున్నారని అనడం.. వంటి పరిణామాలు భారత రాష్ట్ర సమితికి మింగుడుపడటం లేదు