Social Media: సోషల్ మీడియా దుర్వినియోగం అవుతోంది. ఏది తప్పో.. ఏది ఒప్పో తెలియకుండా పోతోంది. ఫేక్ మాయాజాలంతో కొందరు బోల్తా కొట్టిస్తున్నారు. ఏకంగా మీడియా సమాచారాన్ని మార్చేస్తున్నారు. ఒక పత్రిక లోగోను తీసుకొచ్చి.. మరో పత్రికలో వార్తను జత చేసి ప్రచారం చేస్తున్నారు. వీక్షకులను కన్ఫ్యూజ్ చేయడమే లక్ష్యంగా సాగుతున్నారు.
కర్ణాటకలో ఒక ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. సంచలనం సృష్టించింది. ఫాక్స్ కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం.. ఆ కంపెనీ యజమానిని కోరినట్లుగా ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేశారు. అదంతా అబద్ధమని.. ఉద్దేశపూర్వకంగానే సృష్టించిందని సదరు డిప్యూటీ సీఎం క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు బిఆర్ఎస్ కే అంటూ చంద్రబాబు పేరుతో ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొద్దిరోజుల కిందట చంద్రబాబు కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నట్లు ఒక లేఖ హల్ చల్ సృష్టించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టిడిపి న్యూట్రల్ గా ఉంది. ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. ప్రస్తుతం అక్కడ ట్రయాంగిల్ ఫైట్ నెలకొన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారింది. అయితే ఈ తరుణంలో టిడిపి క్యాడర్ను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు ప్రయత్నించాయి. ఇదే తరుణంలో ఫేక్ లెటర్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. చంద్రబాబు పేరుతో వెలువడిన లేఖలు కార్యకర్తలు, అభిమానుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. స్వయంగా చంద్రబాబు పిలుపునిచ్చినట్లుగా సోషల్ మీడియాలో వచ్చిన లేఖలు తెగ వైరల్ అయ్యాయి.దీంతో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్రకటన విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
తొలుత టిడిపి కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నట్టు చంద్రబాబు పేరుతో ఒక లేఖ విడుదలైంది. ” తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే పరిస్థితుల్లో లేదు. జైల్లో ఉండగానే ఈ విషయాన్ని అక్కడి నాయకులకు తెలియజేయడం జరిగింది. ఈ హఠాత్ పరిణామంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు కమ్మ సామాజిక వర్గం వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరంతా ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఆ పార్టీలో సింహభాగం తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నది తెలుగుదేశం నాయకులే. కావున ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి” అంటూ చంద్రబాబు స్వయంగా విజ్ఞప్తి చేసినట్లుగా ఈ లేఖ సాగింది.
తాజాగా బిఆర్ఎస్ కు మద్దతు తెలుపుతూ చంద్రబాబు ఒక లేఖ విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ” తెలంగాణలో పెట్టుబడి పెట్టిన ఆంధ్ర వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకునే దిశగా అక్కడి ప్రభుత్వం వసతులు కల్పించింది. నన్ను రాజకీయ కక్షతో అరెస్టు చేసి జైలుకు పంపించిన జగన్ సర్కార్ తీరును బిఆర్ఎస్ తో పాటు పలు పార్టీలు ఖండించాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో దృష్ట్యా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, నందమూరి అభిమానులు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నా ” అంటూ చంద్రబాబు పేరిట వచ్చిన ఓ లేఖ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ లేఖలను తెలుగుదేశం పార్టీ ఖండించింది. ఇలాంటి వాటిని నమ్మవద్దని టిడిపి క్యాడర్ కు అధినాయకత్వం సూచించింది. ఏమైనా నిర్ణయాలు ఉంటే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే సోషల్ మీడియా పుణ్యమా అని జరుగుతున్న రాజకీయాలు మరీ జుగుప్సాకరంగా మారాయి.