Smita Sabharwal Tweet: తెలంగాణ సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సంర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఖైదీల విడుదలపై ఆమె ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. దీనిపై సానుకూల, ప్రతికూలంగా స్పందించారు ఫాలోవర్స్.. తాజాగా దసరా ఉత్సవాల నేపథ్యంలో చేసిన ట్వీట్ మరోమారు తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు కారణమైంది. గతంలో దసరా ఉత్సవాల నేపథ్యంలో స్మితా సబర్వాల్ వివిధ రాష్ట్రాల్లో స్త్రీ పురుష నిష్పత్తిని తెలియజేసే ఇండియా మ్యాప్‌ను పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన మ్యాప్ తాజా వివాదానికి కారణమయ్యింది.

దసరా ఉత్సవాలపై పోస్ట్
‘దసరా ఉత్సవాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారని, కానీ స్త్రీ, పురుష నిష్పత్తిలో మాత్రం రాష్ట్రాలలో వేరువేరుగా ఉంది’ అని స్మితా సబర్వాల్ పోస్ట్ చేశారు. దీనికి ఆమె ఓ మ్యాప్ జతచేసి ఆసక్తికరంగా ఉందని పేర్కొన్నారు. స్మితాసబర్వాల్ పోస్ట్ చేసిన మ్యాప్‌లో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలలో పురుషులతో పోలిస్తే మహిళల జనాభా తక్కువగా ఉందని స్మితాసబర్వాల్ ట్వీట్ చేశారు. అయితే స్మితా సబర్వాల్ పోస్ట్ చేసిన మ్యాప్ లో కాశ్మీర్ పూర్తిగా లేదని నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఆమె పోస్ట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో స్మితాసబర్వాల్ ఆ పోస్ట్‌ను తొలగించారు. ఇక ట్విట్టర్ వేదికగా మరోమారు ట్వీట్ చేశారు. ‘మీలో చాలామంది ట్వీట్ ఆమోదయోగ్యం కాదని చెప్పిన కారణంగా, నేను క్షమాపణలతో దానిని తొలగిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ‘తన ఉద్దేశం ఎటువంటి మనోభావాలను దెబ్బ తీయాలని కాదు.. అందరికీ దసరా శుభాకాంక్షలు’ అంటూ మరోమారు ట్వీట్ చేశారు.
మద్దతుగా రీట్వీట్స్..
మ్యాప్ డిలీట్ చెయ్యటంతో స్మితా సబర్వాల్‌కు మద్దతుగా నెటిజన్లు రీ ట్వీట్ చేస్తున్నారు. పోస్టు చేసిన మ్యాప్ తప్పు కావచ్చు కానీ ఆమె భావన చాలా గొప్పదంటూ ప్రశంసలు కురిపించారు. ఆమె ఎక్కడా తప్పుగా ట్వీట్ చేయలేదని, ఒకసారి మానవత్వంతో గమనించాలి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
తప్పు పోస్ట్ కాబట్టే డిలీట్..
మరికొందరు స్మితాసబర్వాల్ పోస్ట్ చేసిన మ్యాప్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని, అది తప్పు అని తెలిసిన తర్వాత ఆమె డిలీట్ చేశారని వ్యాఖ్యలు చేస్తున్నారు. మీలో చాలా మందికి ట్వీట్ ఆమోదయోగ్యం కాదని చెప్పారు కాబట్టే డిలీట్ చేశాను అన్నట్టు చేసిన స్మితాసబర్వాల్ ట్వీట్ ను కూడా కొందరు తప్పు పడుతున్నారు. ఏది ఏమైనా ఇటీవల కాలంలో స్మితాసబర్వాల్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్ట్‌లు చర్చనీయాంశంగా మారడం గమనార్హం.

బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై..
ఇంతకు ముందు బిల్కిస్ బానో కేసులో దోషులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడంపై స్మితాసబర్వాల్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘‘బిల్కిస్ బానో కేసులో దోషులను ప్రభుత్వం విడుదల చేయడం వార్తలను చదివి తను అవిశ్వాసంతో ఉన్నానని, భయం లేకుండా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే బిల్కిస్ బానో హక్కును కోల్పోయిందని, మనల్ని మనం స్వేచ్ఛ దేశంగా చెప్పుకోలేం’’ అంటూ స్మితాసబర్వాల్ ట్వీట్ చేశారు. అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో స్మితాసబర్వాల్ ట్వీట్ చర్చనీయాంశం అయింది. ఆమెకు మద్దతుగా కొందరు, ఆమె రాజకీయ నాయకుల్లాగా మాట్లాడారని ప్రతికూలంగా మరికొందరు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Also Read: Jagan vs Chandrababu: 2024లో చంద్రబాబు ప్రభావమెంత? జగన్ ను ఓడించగలడా?