Skype : ఒకప్పుడు ఇంటర్నెట్ ఉపయోగించే వాళ్లకు వీడియో కాలింగ్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు స్కైప్. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఒకరితో ఒకరు విజిబిల్డ్ గా కనెక్ట్ చేసిన ఈ ఉచిత వేదిక మరికొద్ది రోజుల్లో కనుమరుగు కాబోతుంది. 2003లో ప్రారంభమైన స్కైప్ దాదాపు రెండు దశాబ్దాల పాటు వీడియో కాలింగ్ లో ప్రపంచాన్ని శాసించింది. అయితే, కాలక్రమేణా టెక్నాలజీలో వచ్చిన మార్పులు, పోటీదారుల నుండి ఎదురైన తీవ్రమైన పోటీ కారణంగా స్కైప్ తన ప్రాభవాన్ని కోల్పోయింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో వీడియో కాలింగ్ వినియోగం విపరీతంగా పెరిగినప్పటికీ, జూమ్, గూగుల్ మీటింగ్స్, వాట్సాప్ వంటి ఇతర వేదికలు లేటెస్ట్ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించడంతో స్కైప్ వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇక స్కైప్ సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. అధికారిక ప్రకటన ప్రకారం.. మే 5, 2025 నుంచి స్కైప్ తన కార్యకలాపాలను నిలిపివేయనుంది.
స్కైప్ ప్రస్థానం
2003లో నిక్లాస్ జెన్‌స్ట్రోమ్, జాన్స్ ఫ్రియిస్ అనే ఇద్దరు సాఫ్ట్ వేర్ డెవలపర్లు స్కైప్‌ను ప్రారంభించారు. ఇది ఉచితంగా ఇంటర్నెట్ ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని అందించడంతో తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఒకప్పుడు విదేశాల్లో ఉన్నవారితో మాట్లాడాలంటే చాలా ఖర్చుతో కూడుకునేది. ఆ సమయంలో స్కైప్ ఒక విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. 2011లో మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో స్కైప్ తన సర్వీసులను మరింత విస్తరించింది. కొత్త ఫీచర్లను ఇంకొన్ని యాడ్ చేసింది. అయితే, స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరగడం, మొబైల్ ఆధారిత కమ్యూనికేషన్ యాప్‌లు అందుబాటులోకి రావడంతో స్కైప్ తన స్పెషాలిటీని నిలబెట్టుకోలేకపోయింది.
Also Read : వాట్సప్ కు మనం అలవాటు పడిపోయాం గాని.. అంతకంటే గొప్ప యాప్స్ చాలా ఉన్నాయి.. ఇంతకీ అవి ఏంటంటే..
మూసివేతకు అసలు కారణం ఇదే
స్కైప్‌ను మూసివేయడానికి ప్రధాన కారణం దాని వినియోగదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమే. జూమ్, గూగుల్ మీటింగ్స్ వంటి వేదికలు బిజినెస్ అవసరాలను అనుగుణంగా అనేక లేటెస్ట్ ఫీచర్లను అందిస్తున్నాయి. మరోవైపు వాట్సాప్ వంటి మొబైల్ యాప్‌లు ఈజీ ఇంటర్‌ఫేస్, మొబైల్ ఇంటిగ్రేషన్‌తో పర్సనల్ కస్టమర్లను ఎక్కువగా ఆకర్షించాయి. ఈ పోటీని తట్టుకుని స్కైప్ తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. దీంతో మైక్రోసాఫ్ట్ తన వనరులను మరో కమ్యూనికేషన్ వేదికలపై కేంద్రీకరించాలని నిర్ణయించుకుంది.
టీమ్స్‌కు ప్రాధాన్యత
మైక్రోసాఫ్ట్ తన వినియోగదారులందరినీ ఒకే కమ్యూనికేషన్ వేదికపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే స్కైప్‌ను మూసివేసి, దాని స్థానంలో మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ను ప్రోత్సహిస్తోంది. టీమ్స్ కేవలం వీడియో కాలింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా, మెసేజింగ్, ఫైల్ షేరింగ్, టీమ్ కొలాబరేషన్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇది వ్యక్తిగత వినియోగదారులతో పాటు వ్యాపార అవసరాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. స్కైప్ వినియోగదారులు టీమ్స్‌కు మారడాన్ని సులభతరం చేయడానికి మైక్రోసాఫ్ట్ అనేక చర్యలు తీసుకుంది. స్కైప్ ఐడీతోనే టీమ్స్‌లోకి లాగిన్ అవ్వొచ్చు, అలాగే స్కైప్‌లోని చాట్ హిస్టరీ, కాంటాక్ట్‌లను కూడా టీమ్స్‌లోకి ట్రాన్స్ ఫర్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది.
స్కైప్ క్రెడిట్, స్కైప్ కాలింగ్ వంటి పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లను మైక్రోసాఫ్ట్ ఇప్పటికే నిలిపివేసింది. వినియోగదారులు తమ ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్ గడువు ముగిసే వరకు సర్వీసులను ఉపయోగించుకోవచ్చని, ఆ తర్వాత అన్ని పెయిడ్ సర్వీసులను శాశ్వతంగా నిలిచిపోతాయని కంపెనీ స్పష్టం చేసింది. ఉచిత సేవలు కూడా మే 5, 2025 నుండి పూర్తిగా నిలిచిపోతాయి.
Also Read : వాట్సప్ కు మనం అలవాటు పడిపోయాం గాని.. అంతకంటే గొప్ప యాప్స్ చాలా ఉన్నాయి.. ఇంతకీ అవి ఏంటంటే..