Kolkata case : కోల్ కతా లోని అర్జీ కార్ ఆస్పత్రిలో శిక్షణ వైద్యురాలి హత్యాచార ఘటనను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే తీవ్రంగా పరిగణించింది. దీనిని సుమోటోగా స్వీకరించి, విచారణ సాగిస్తోంది. గురువారం సిబిఐ సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్ట్ అందించింది. ఈ రిపోర్టులో పలు కీలక విషయాలను సుప్రీంకోర్టు ఎదుట ఉంచింది. “విచారణ నిమిత్తం మేము ఆసుపత్రికి వెళ్ళగానే.. అక్కడ నేర దృశ్యం పూర్తిగా మారిపోయి ఉంది. ఘటన జరిగిన అనంతరం.. కేసు నమోదు చేసిన ఐదు రోజుల తర్వాత మా దర్యాప్తులోకి వచ్చింది. మాకు ఈ కేసు అత్యంత సవాల్ విసురుతోంది. ఆ వైద్యురాలు అత్యాచారానికి గురైన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ ను అర్ధరాత్రి సమయంలో నమోదు చేశారు. ఇది మాకు తీవ్రస్థాయిలో దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఆమెది ఆత్మహత్య అని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కేసును పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం విజయవంతంగా చేశారు. అయితే వాస్తవాలు వేరే విధంగా ఉండడంతో ఆ వైద్యురాలి స్నేహితులు, ఇతర ఉద్యోగులు వీడియోగ్రఫీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు శవ పరీక్షను మొత్తం వీడియో తీశారని” సిబిఐ అధికారులు కోర్టుకు విన్నవించిన నివేదికలో పేర్కొన్నారు.
ఈ నివేదికను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర చూడ్ ఆధ్వర్యంలో బెంచ్ పరిశీలించింది. ఈ క్రమంలో కోల్ కతా పోలీసులు వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టింది. కేసు నమోదులో చోటు చేసుకున్న లోపాలపై ప్రశ్నలు సంధించింది. ” రోగులకు సేవలు అందించాల్సిన ఆమె చనిపోయింది. ఆ ప్రదేశంలో అర్థనగ్నంగా, విగత జీవిగా కనిపించింది. అయినప్పటికీ మీరు రికార్డులలో అత్యంత ఆలస్యంగా అసహజ మరణం అని పేర్కొన్నారు. దానిని నమోదు చేయడానికి ముందు పోస్టుమార్టం నిర్వహించారు. అది మాకు అత్యంత విచిత్రంగా అనిపిస్తోంది. శవ పరీక్ష నిర్వహించిన 18 గంటల తర్వాత మీరు నేరం జరిగిన స్థలాన్ని ఎందుకు సీల్ చేశారని” సుప్రీంకోర్టు స్పందించింది..” ఈ కేసులో మాకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వ్యవహార శైలి మాకు అనుమానాస్పదంగా కనిపిస్తోంది. ఈ కేసును ముందుగా రికార్డులో రాసిన పోలీస్ అధికారి.. మేము నిర్వహించే తదుపరి విచారణకు హాజరుకావాలి. ఈ కేసులో నిందితుడి వైద్య నివేదిక కూడా సమర్పించాలి. 30 సంవత్సరాలలో ఇలాంటి వ్యవస్థాగత లోపాలను చూడలేదు. సామాజిక మాధ్యమాలలో వ్యక్తం చేసే వాదనలను ఇంతమంది ముందు ఇక్కడ ప్రదర్శించోద్దని” పోలీసుల తరఫున న్యాయవాదులపై కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.