YS Sharmila: ఏపీ విషయంలో కాంగ్రెస్ పార్టీ భారీ వ్యూహంతో ఉందా? తమ ఈ పరిస్థితికి జగన్ కారణమని భావిస్తోందా? గట్టి రివెంజ్ తీసుకోవాలని నిర్ణయించిందా? అందుకే షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించిందా? ఏపీ పగ్గాలను అందించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా కడప జిల్లాలో జగన్ ఆధిపత్యానికి గండి కొట్టాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేపు పిసిసి అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు తీసుకోనున్న షర్మిల కడప జిల్లాలో భారీ బల ప్రదర్శనకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా వివేక హత్యను అస్త్రంగా మలుచుకుని విజయం అందుకోవాలని షర్మిల భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి పోటీ చేసే అవకాశం ఉంది. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక కుమార్తె సునీత ను బరిలో దించాలని షర్మిల చూస్తున్నారు. కొద్ది రోజుల్లో సునీత సైతం కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి పై వ్యతిరేకతతో పాటు సునీత పై సానుకూలత కలిసి వస్తుందని షర్మిల అంచనా వేస్తున్నారు.
మరోవైపు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మను పోటీ చేయించేందుకు షర్మిల ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది. 1978 నుంచి పులివెందుల స్థానం వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. 1978, 1983, 1985 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.1989, 1994 ఎన్నికల్లో మాత్రం వివేకానంద రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్లీ 1999 నుంచి రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు పులివెందుల ఎమ్మెల్యేగా కొనసాగారు. మధ్యలో ఉప ఎన్నికల్లో విజయమ్మ గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో జగన్ గెలిచారు. 2024 ఎన్నికల్లో సౌభాగ్యమ్మను పోటీలో దించటం ద్వారా జగన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని షర్మిల భావిస్తున్నారు. మొత్తానికైతే షర్మిల గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.