TDP Janasena Alliance: ఏపీలో ఎన్నికలకు పట్టుమని రెండు నెలల వ్యవధి కూడా లేదు. ఏ క్షణం అయినా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. కిందిస్థాయి సిబ్బందికి సైతం స్థానచలనం తప్పలేదు. మరోవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించాయి. చంద్రబాబు రా కదలిరా సభల పేరుతో గత నెల రోజులుగా తీరిక లేకుండా గడుపుతున్నారు. మరోవైపు సీఎం జగన్ సిద్ధం పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఈనెల 4 నుంచి పవన్ పొలిటికల్ టూర్లకు ప్రణాళిక వేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సర్వే సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని బయటపెడుతున్నాయి.
కొద్ది రోజుల కిందట వరకు వైసీపీకి అనుకూలంగా సర్వేలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రైజ్ అనే సర్వే సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. 175 నియోజకవర్గాల్లో లక్ష 80 వేలకు పైగా నమూనాలను సేకరించింది. వందలాదిమంది శిక్షణ పొందిన వారు ఈ సర్వేలో పాల్గొన్నట్లు సంబంధిత సంస్థ చెబుతోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్లు.. పారదర్శకంగా సర్వే చేసినట్టు.. అన్ని వర్గాల వారి నుంచి రాండమ్ గా అభిప్రాయాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన సర్వేలకు భిన్నంగా ఈ సంస్థ ఫలితాలను వెల్లడించడం విశేషం.
మొత్తం 175 నియోజకవర్గాలకు గాను టిడిపి, జనసేన కూటమి 95 స్థానాలను గెలుచుకుంటుందని సర్వే తేల్చింది. వైసిపి కేవలం 45 స్థానాలకు పరిమితం అవుతుందని.. 35 స్థానాల్లో గట్టి ఫైట్ ఉంటుందని స్పష్టం చేసింది. ప్రధానంగా కోస్తా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో టిడిపి, జనసేన కూటమి స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని సర్వే అభిప్రాయపడింది. రాయలసీమలో మాత్రం వైసిపి ఆధిపత్యం కొనసాగుతుందని తేల్చేసింది. కొద్ది రోజుల కిందట రైజ్ సర్వే సంస్థ పార్లమెంట్ స్థానాల వారీగా సర్వే ఫలితాలను వెల్లడించింది. ఇప్పుడు అసెంబ్లీ స్థానాల వారీగా సర్వే ఫలితాలను వెల్లడించడం విశేషం.
పార్లమెంట్ స్థానాలకు సంబంధించి టిడిపి జనసేన కూటమి 15 ఎంపీ స్థానాలను దక్కించుకుంటుందని సర్వే తేల్చింది. వైసిపి ఐదు పార్లమెంట్ స్థానాలకు పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. మరో ఐదు స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని తేల్చి చెప్పింది. శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, హిందూపురంలో టిడిపి, జనసేన కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. వైసీపీకి సంబంధించి అరకు, కడప, రాజంపేట, నంద్యాల, ఒంగోలులో గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. విశాఖపట్నం, నరసరావుపేట, మచిలీపట్నం, బాపట్ల, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో గట్టి ఫైట్ ఉంటుందని సర్వే తేల్చడం విశేషం. అయితే ఈ సర్వే ఫలితాలు సానుకూలంగా రావడంతో టీడీపీ, జనసేన శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి