Telangana Congress: టీపీసీసీలో వివాదాలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా సీనియర్లకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మధ్య పొసగడం లేదు. దీంతో వారు ప్రతిసారి రేవంత్ రెడ్డి తీరును తప్పుపడుతూ అధిష్టానానికి లేఖలు రాయడం చేస్తున్నారు. ఇటీవల పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తూ లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిని క్రమశిక్షణ సంఘం తప్పుబట్టింది. దీంతో ఆయన కూడా స్పందించారు.
నన్ను క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరు కావాలని పిలుస్తామని చెప్పడంతో జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై మరోమారు వ్యాఖ్యలు చేశారు. తనదే తప్పు అంటున్నారే కానీ రేవంత్ రెడ్డిది తప్పు కాదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక నేతల్లో సమన్వయం కొరవడిందని పేర్కొన్నారు. దీంతోనే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అందుకే తాను పీసీసీ అధ్యక్షుడిపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
Also Read: రేవంత్ రెడ్డి నిర్బంధంలో ప్రభుత్వ ఆలోచన ఏమిటో?
క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి జగ్గారెడ్డి తీరును తప్పుపట్టడంతో ఆయన కూడా తనదైన శైలిలో తన మనసులోని మాట బయటపెట్టారు. ఎర్రవెల్లిలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంపై ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆ జిల్లా ఎమ్మెల్యేనైనా తనతో కూడా చర్చించకపోవడంతోనే ఆయనపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలపై అధిష్టానం కూడా దృష్టి సారించినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. నేతల్లో కొరవడిన సఖ్యతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని గాడిలో పెట్టి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
Also Read: వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టార్గెట్ 40 సీట్లు.. మళ్లీ దానికో లెక్కుంది..?