
సంక్షేమంలో తాము అగ్రభాగంలో ఉన్నామని, అదే తమను వచ్చే ఎన్నికల్లో గట్టెక్కిస్తుందని నమ్ముతున్నారు వైసీపీ పెద్దలు. ప్రజలు కూడా తమ వెంటే ఉన్నారని, ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలన్నీ ఏకపక్షంగా రావడమే ఇందుకు నిదర్శనం అని చెబుతున్నారు. అయితే.. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది కాబట్టి.. అప్పటిలోగా ప్రజల నాడి ఎటు మారుతుందనేది ఇప్పుడే చెప్పడం అసాధ్యం. ఆ విషయం కాస్త అటుంచితే.. పార్టీలోనే జగన్ కు ఇబ్బందులు ఎదురవుతాయనేది విశ్లేషకుల అంచనా.
వైసీపీలో సెకండ్ ప్లేస్ ఎవరిది అంటే చెప్పలేని పరిస్థితి. ఆ విధంగా వన్ మ్యాన్ షో నడుస్తోంది. ఇప్పటి వరకూ ఇదే కండీషన్ కొనసాగింది. గత ఎన్నికల్లో జగన్ ఒకేసారి ఎంపీలు, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి అభ్యర్థుల ప్రకటన దశలవారీగా చేస్తాయి పార్టీలు. ఎక్కడ అసంతృప్తులు వచ్చే అవకాశం ఉంది? ఎవరు ఎదురు తిరుగుతారు? ఎవరికి టిక్కెట్ ఇవ్వాలని సుదీర్ఘ ఆలోచనలు చేసి, విడతల వారీగా అనౌన్స్ చేస్తారు. కానీ.. జగన్ మాత్రం ఒకేసారి ప్రకటించి సత్తా చాటారనే చెప్పాలి. కానీ.. వచ్చే సారికి అంత సీన్ లేదని అంటున్నారు.
త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుందనే చర్చ సాగుతోంది. పాతిక పోస్టులు ఉంటే.. ఆశావహులు మాత్రం వంద మంది దాకా ఉన్నారు. మొదటి విస్తరణలో సగం పాలన తర్వాత ఇస్తామని చెప్పారు కాబట్టి.. సైలెంట్ గా ఉన్నారు. కానీ.. ఈసారి కూడా పదవి దక్కకపోతే అంతే. అందుకే.. అసంతృప్తులు ఖాయమని అభిప్రాయ పడుతున్నారు. ఇదే జరిగితే.. వచ్చే ఎన్నికల నాటికి మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు.
మరోవైపు.. ఇప్పుడున్న వారిలో దాదాపు యాభై మందికిపైగా సరిగా పని చేయట్లేదనే అభిప్రాయంతో ఉన్నారట జగన్. కరోనా సమయంలో ప్రజలను పట్టించుకోలేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అలాంటి వారు పద్ధతి మార్చుకోవాలని సూచించారట. రాబోయే సమయంలో వారు కవర్ అయినట్టు కనిపించకపోతే.. టిక్కెట్ దక్కడం కష్టమే. అదే జరిగితే.. వారి నుంచి అసంతృప్తులు వచ్చే అవకాశం ఉందని, అది పార్టీ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు వస్తున్నాయి.
ఇంకోవైపు.. పలువురు ఎంపీలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. దానికి, ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలు అంగీకరించడం అసాధ్యం. తద్వారా ఈ కోణంలో కూడా అసంతృప్తులు చెలరేగడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. దీంతోపాటు.. లెక్కలు వేయడానికి, వ్యూహాలు రచించడానికి పోయిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. ఈ సారి ఆయన కూడా లేరు. కాబట్టి ఏ రకంగా చూసినా అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం సంగతి అటుంచితే.. అసంతృప్తులు లేకుండా జాబితా అనౌన్స్ చేయడం అసాధ్యమని అంటున్నారు. మరి, జగన్ ఈ సమస్యను అధిగమించి, గెలుపు తీరాలకు చేరుతారా? అన్నది చూడాలి.