CM Jagan: దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. విజయదశమి సందర్భంగా ఏపీ సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ తరుణంలో సీఎం జగన్ వ్యవహార శైలి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ ఆలయాల సందర్శనలో భాగంగా సీఎం జగన్ పలు విమర్శలను ఎదుర్కొన్నారు. అన్య మతస్తుడిగా జగన్ను విపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. ఆయన ప్రభుత్వ అధినేత హోదాలో దేవస్థానాలకు పట్టు వస్త్రాలు సమర్పించే క్రమంలో భార్య భారతీ రెడ్డితో రాకపోవడాన్ని ప్రస్తావిస్తుంటారు. తీర్థప్రసాదాలు స్వీకరించడంలో, పూజాధి కార్యక్రమాలు చేపట్టడంలో ఏ చిన్నపాటి తప్పిదం జరిగినా భూతద్దంలో పెట్టి విమర్శలు చేస్తుంటాయి. ఇటువంటి తరుణంలో సీఎం జగన్ మరోసారి వార్తల్లో నిలిచారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని దర్శించుకునే క్రమంలో జగన్ అందరి దృష్టిని ఆకర్షించారు.
సోమవారం అమ్మవారిని దర్శించుకున్న జగన్క్ ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం సీఎం జగన్ ను వేదపండితులు ఆశీర్వదించారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. అయితే ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకున్న జగన్.. అనంతరం తిన్నారు. గత కొద్దిరోజులుగా తనపై వస్తున్న విమర్శలను గట్టిగానే తిప్పికొట్టారు. తనపై అన్యమత ముద్ర వేసి ఆలయాల సందర్శనలో విమర్శలు వ్యక్తం చేస్తుండడాన్ని ముందుగానే గ్రహించారు. అమ్మవారి ప్రసాదాన్ని భక్తి ప్రపత్తులతో స్వీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విపక్షాల తీరును ఎండగడుతూ వైసిపి శ్రేణులు ఈ వీడియోను ట్రోల్ చేస్తున్నాయి.