Vangaveeti Radha- Paritala Sriram: ఏపీలో ఎన్నికల ఫీవర్ ముందుగానే వచ్చేసింది. ముందస్తా.. లేకుంటే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నదానిపై స్పష్టత లేకున్నా అన్ని పార్టీలూ రేపే ఎన్నికలన్నట్టు వ్యూహాలు పన్నుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికలు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కీలకం. ఫలితాలు తారుమారైతే ఆ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదముంది. అందుకే చంద్రబాు ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. అందులో భాగంగా యువ జపం పఠిస్తున్నారు. 40 శాతం యువతకే టిక్కెట్లు ఇచ్చేందుకు నిర్ణయించారు. అటు పార్టీలో సీనియర్ల వారసులను బరిలో దించేందుకు నిర్ణయించారు. అటు వైసీపీలో మాత్రం వారసులకు టిక్కెట్లు ఇచ్చేది లేదని జగన్ తేల్చిచెప్పారు. టీడీపీలో మాత్రం యువ సందడి అధికంగా ఉంది. ఇటువంటి తరుణంలో వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్, బాలయోగి కుమారుడు హరీష్ కలిసిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీశాయి.

వంగవీటి, పరిటాల పేర్లకు వైబ్రేషన్ ఉంది. తెలుగునాట ఈ రెండు బలమైన నేపథ్యమున్న రాజకీయ కుటుంబాలు. ఆ కుటుంబ వారసులు ఒక చోట కలిశారంటే అది కచ్చితంగా రాజకీయాల కోసమేనని టక్ నడుస్తోంది. ఈ ముగ్గురు యువనేతలు రాజమండ్రిలో కలిశారు. ప్రస్తుతం రాధా, శ్రీరామ్ , హరీష్ లు టీడీపీలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వీరు కీ రోల్ పోషించాలనుకున్నారు. అటు సామాజిక కోణంలోనే వచ్చే ఎన్నికలు జరగనున్నందున సామాజికవర్గ ఓట్లు రాబెట్టుకునేందుకు చంద్రబాబు వీరి సేవలను వినియోగించుకోనున్నారు. సామాజికవర్గపరంగా ఫుల్ మాస్ యూత్ లీడర్లుగా ఉండడంతో వీరి సేవలకు అక్కరకు వస్తాయని అధినేత ముందుగానే గ్రహించారు. గెలుపోటములతో సంబంధం లేకుంటే రాష్ట్రంలో వీరిని అభిమానించే వారు లక్షలాది మంది ఉంటారు. అటువంటి వారిని టీడీపీ వైపు నిలిచేలా ప్లాన్ లో భాగంగానే ముగ్గురు కలిశారని తెలుస్తుండడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది.

గతంలో వంగవీటి రాధాపై హత్యకు రెక్కీ నిర్వహించారన్న ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాధాకు సంఘీభావం తెలిపాయి. చంద్రబాబు నేరుగా వచ్చి రాధాతో చర్చించారు. ఆ సమయంలో పరిటాల శ్రీరామ్ స్పీడుగా స్పందించారు. రాధాకు అండగా నిలబడ్డారు. అప్పటి నుంచి వారి మధ్య స్నేహం కొనసాగుతోంది. ముఖ్యంగా టీడీపీ యువనేతలను సమన్వయం చేసే బాధ్యతలను చంద్రబాబు వారిద్దరికి అప్పగించారు. మరోవైపు త్వరలో లోకేష్ పాదయాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో వీరి సేవలను ఏపీ వ్యాప్తంగా వినియోగించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. అందుకే రాధా, శ్రీరామ్ లు యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది.