UK PM Liz Truss: బోరిస్ జాన్సన్ స్థానంలో బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లీ జ్ ట్రస్ పదవి సంక్షోభంలో చిక్కుకుంది. ఆమె తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంటే, అధిక ఆదాయం ఉన్నవారికి పన్నులు తగ్గిస్తూ ట్రస్ తీసుకొన్న నిర్ణయం ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది. ఫలితంగా కన్జర్వేటివ్ పార్టీలోనూ, ఆర్థిక విపణు ల్లోనూ ఆమె కష్టాల కడలి నుంచి గట్టెక్కడం సులభం కాదనే పరిస్థితి వచ్చింది. దీంతో తన ఆర్థిక మంత్రి క్వాసీ క్యార్తెంగ్ ను పదవి నుంచి తొలగించారు. ఫలితంగా ఆయన ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్లోని ఆర్థిక ప్యాకేజీ అంశాలను కొత్త ఆర్థిక శాఖ మంత్రి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. బహుశా బ్రిటన్ చరిత్రలో ఇలాంటి పరిణామం ఇదే మొదటిసారి కావచ్చు. పన్నుల్లో కోత విధించడంపై లీజ్ వెనక్కి తగ్గడం తాత్కాలిక ప్రశాంతతను తీసుకొచ్చినా.. పార్టీలో అసంతృప్తిని ఎదుర్కొనేందుకు, దేశాన్ని తిరిగి ఆర్థిక పురోగతి పథంలో నడిపించేందుకు సరిపోదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు విమర్శించారు
1980లో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ స్ఫూర్తితో బ్రిటన్ ప్రధానమంత్రి గత నెల 23న మితవాద పక్ష ప్రణాళిక రూపొందించారు. దీని ప్రకారం 4500 కోట్ల పౌండ్ల మేర పన్నుల్లో కోత విధించారు. దీనివల్ల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ పౌరుల ఖర్చులు మరింత పెరిగాయి. ఈ పరిణామంతో కన్జర్వేటివ్ పార్టీ విజయవకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోయాయని రాజకీయ విశ్లేషకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.. వాస్తవానికి లీజ్ పగ్గాలు చేపట్టి కొద్ది వారాలైనా గడవకముందే సొంత పార్టీలో అగ్గిరాజు కోవడం గమనార్హం. ప్రస్తుతం బ్రిటన్ ప్రధానమంత్రి ఆర్థిక ఎజెండాను అమెరికా అధ్యక్షుడు బై డెన్ సైతం విమర్శిస్తున్నారు. అయితే ఒత్తిళ్ల దృష్ట్యా సొంత స్నేహితుడిని ఆర్థిక మంత్రిగా తప్పించాల్సి రావడం బాధాకరమేనని లీజ్ సైతం అంగీకరిస్తున్నారు. అయితే ఈ ఆర్థిక ప్యాకేజీ రూపకర్తల్లో లీజ్ కూ సమాన భాగం ఉంది. కాకపోతే ఆర్థిక మంత్రి బలి పశువు అయ్యారు. ఇప్పుడు కొత్తగా ఈ శాఖకు జెరేమీ హంట్ మంత్రిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఈ పదవి ఆయనకు కత్తి మీద సామే. అక్టోబర్ 31న కొత్త బడ్జెట్ ప్లాన్ ను దేశానికి ఆయన అందించాల్సి ఉంటుంది.
కఠినమైన కార్యాచరణ తప్పనిసరి
దేశంలో ఆర్థిక కష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మెరుగైన జీవనం అందించేందుకు కఠినమైన కార్యాచరణకు దిగాల్సిన పరిస్థితి లీజ్ ప్రభుత్వానికి ఏర్పడింది. గతంలో కార్పొరేషన్ ట్యాక్స్ ను 19% వద్దే స్తంభింపచేస్తామని లీజ్ ప్రకటించారు. వచ్చే సంవత్సరం దానిని 25 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించడం ఆమెలో ద్వంద్వ విధానానికి నిదర్శనం. ఇప్పటికే సొంత పార్టీ నుంచి నలుగురు ఎంపీలు ఆమెను ప్రధాని పీఠం నుంచి దిగిపోవాలని బాహాటంగానే అంటున్నారు. వేల ఆమె తప్పుకుంటే తదుపరి వ్యక్తి నియమితులయ్యే దాకా ఆమె ఆ పదవిలో కొనసాగుతారు. ఒకవేళ అదే జరిగితే రెండు నెలల లోపలే రెండోసారి కన్జర్వేటివ్ పార్టీ సారధికి ఎన్నిక తప్పదు. అయితే ఈసారి సుదీర్ఘ పోటీ లేకుండా ఒకరి వెంటే పార్టీ నిలిచి పట్టాభిషేకం చేయవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బ్రిగ్జిట్ రెఫరండం పర్యావసనాల తర్వాత 2016 లో డేవిడ్ కామెరాన్ స్థానంలో థెరిసా మె అలానే వచ్చారు.

కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు అనేక వర్గాలుగా చీలి, అంతర్గత విభేదాలు ఉన్న పార్టీలో అది సాధ్యమా అన్నది చూడాలి. ఇక రిషి సునక్ ప్రధానమంత్రి పదవికి పోటీపడి చివరి నిమిషంలో వెనుకంజ వేశారు. కానీ ఇప్పుడు లీజ్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలతో ఆయన మళ్ళీ రేసులోకి వచ్చారు. చాలామంది ఎంపీలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అన్ని అనుకున్నట్టు జరిగితే ఒకప్పుడు భారతదేశాన్ని 200 ఏళ్లపాటు ఏలిన బ్రిటన్ ను ఒక భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి పాలించే అవకాశం ఏర్పడుతుంది. అయితే దీనికి మిగతా ఎంపీలు ఏ మేరకు సహకరిస్తారనే దాని పైనే ఆధారపడి ఉంది. మొన్న క్వీన్ ఎలిజబెత్ అంతక్రియలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన బ్రిటన్ ప్రభుత్వం.. పేదలపై మాత్రం ఆ ఉదారత చూపడం లేదు. అందుకే పౌరుల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతున్నది. ఇది ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణమైనా ఇది పేలుడుకు దారి తీసే అవకాశం ఉంది.