ఎరక్కపోయి ఇరుక్కున్నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సాధారణంగా విడిచిన బాణం.. జారిన నోటి మాట వెనక్కి తీసుకోలేం. సాధారణ వ్యక్తులైనా.. సినీ, రాజకీయ ప్రముఖులైన వేదికలపై జాగ్రత్తగా మాట్లాడాలి. వాటిపై అవగాహన ఉంటేనే స్పందించాలి. లేకుంటే ఇలానే అవమానాల పాలవుతారు.
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్ ఎవరు? అంటే ఎవరైనా ఠక్కున సమాధానం చెబుతారు. మన తెలుగు బిడ్డ ‘సత్య నాదెళ్ల’. హైదరాబాద్ లో చదువుకున్న ఈ అనంతపురం వాసి ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత సంస్థకు చైర్మన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ఘనత గురించి అందరికీ తెలుసు.
కానీ ఫాఫం.. మన రేవంత్ రెడ్డికి మాత్రం తెలియకపోవడంతో ఇప్పుడు ట్రోలర్స్ బారినపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ‘మూడు చింతలపల్లిలో రెండు రోజుల దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ ముగింపు సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. 2023లో అధికారంలోకి కాంగ్రెస్ వస్తే పేద, దళిత, గిరిజన, మైనార్టీలకు అత్యున్నత విద్యనందిస్తామని.. చదువుతోనే భవిష్యత్ అని చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే బాగా చదువుకున్న మన తెలుగు బిడ్డలు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని.. విప్రో/ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకు సీఈవోలు సత్యనాదెళ్ల వంటి వారు ఎదిగారని రేవంత్ రెడ్డి నోరు జారారు. నాదెళ్ల పేరు కూడా కరెక్ట్ గా తెలియకపోవడంతో పక్కనున్న వారిని అడిగి మరీ ఈ మాట తూలారు.
రేవంత్ నోరు జారగానే ఆయన ప్రత్యర్థులు ఆ వీడియోను అందిపుచ్చుకున్నారు. వెంటనే రేవంత్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘రేవంతన్నా.. సదువుల కాడికి జర పోకే.. అది కూడా సాఫ్ట్ వేర్ కాడికి పోకు.. తెలియకపోతే నవ్వుల పాలవుతాం’ అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ముఖ్యంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఇప్పుడు రేవంత్ రెడ్డి వీడియో తో పండుగ చేసుకుంటూ తెగ ట్రోలింగ్ మొదలుపెట్టింది.
https://twitter.com/ashapriya09/status/1430534972067119106?s=20