https://oktelugu.com/

Samsung : నిద్రలేని రాత్రులు, విశ్రాంతి లేని పని..శామ్‌సంగ్ కో-సీఈవో మృతి వెనుక కథ.

Samsung : ప్రపంచంలోని దిగ్గజ ఎలక్ట్రానిక్స్ సంస్థల్లో ఒకటైనటువంటి శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (కో-సీఈఓ) హన్ జాంగ్-హీ (63) హఠాత్తుగా మృత్యువాత పడడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది.

Written By: , Updated On : March 28, 2025 / 10:53 AM IST
Samsung

Samsung

Follow us on

Samsung : ప్రపంచంలోని దిగ్గజ ఎలక్ట్రానిక్స్ సంస్థల్లో ఒకటైనటువంటి శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (కో-సీఈఓ) హన్ జాంగ్-హీ (63) హఠాత్తుగా మృత్యువాత పడడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఆయన మరణానికి గల కారణాలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పలు వార్తా సంస్థలు పేర్కొంటున్న ప్రకారం.. హన్ జాంగ్-హీ అధిక పనిభారం కారణంగానే గుండెపోటుకు గురై చనిపోయినట్లు చెబుతున్నారు.

నివేదికల ప్రకారం.. హన్ జాంగ్-హీ రోజుకు దాదాపు 15 నుంచి 16 గంటల పాటు పనిచేసేవారు. ఈ అధిక పని ఒత్తిడి కారణంగా ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కేవలం పనిభారమే కాకుండా.. ఆయన ఎక్కువ సమయం ల్యాప్‌టాప్, ఫోన్ స్క్రీన్‌ల ముందు గడపడం వల్ల 2023లోనే న్యూరో సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నారు. దీని కారణంగా ఆయన తరచుగా మైగ్రేన్‌తో బాధపడటమే కాకుండా, చేతులు, మెడ నొప్పి కూడా ఆయనను వేధించాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి హన్ జాంగ్-హీ ఆరోగ్యం మరింత క్షీణించిందని సమాచారం

Also Read : మార్కెట్లోకి కొత్తగా Samsung ల్యాప్ ట్యాప్స్.. అదరిపోయే AI ఫీచర్స్.. షాకింగ్ ధరలో..

శామ్‌సంగ్ వంటి మల్టీ నేషనల్ కంపెనీ కో-సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించడం ఎంతో ఒత్తిడితో కూడుకున్న పని. నిరంతరం కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, మార్కెట్ పోకడలను ఫాలో కావడం, పోటీదారులను ఎదుర్కోవడం వంటి అనేక సవాళ్లను వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హన్ జాంగ్-హీ కూడా ఇదే విధమైన ఒత్తిడిలో పనిచేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

అధిక పనిభారం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టెక్ పరిశ్రమలో పనిచేసే ఉన్నత స్థాయి అధికారులు, ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. గంటల తరబడి కంప్యూటర్ల ముందు పనిచేయడం, నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల వారి ఆరోగ్యం క్షీణిస్తోంది. హన్ జాంగ్-హీ మరణం మరోసారి ఈ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది.

కొన్ని ఇతర నివేదికలు హన్ జాంగ్-హీ మరణానికి ఇతర ఆరోగ్య కారణాలు కూడా ఉండవచ్చని చెబుతున్నాయి. అయితే, అధిక పనిభారం ఆయన ఆరోగ్యాన్ని మరింత దిగజార్చి గుండెపోటుకు దారితీసి ఉండవచ్చని చాలా మంది నమ్ముతున్నారు. శామ్‌సంగ్ సంస్థ ఈ విషయంపై ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. హన్ జాంగ్-హీ మరణం శామ్‌సంగ్ సంస్థకు తీరని లోటు అని చెప్పవచ్చు. ఆయన ఎలక్ట్రానిక్స్ రంగంలో తనదైన ముద్ర వేశారు. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషాద ఘటన కార్పొరేట్ ప్రపంచంలో పని చేసే వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాన్నిమరోసారి గుర్తు చేస్తుంది. అధిక పనిభారం, అనారోగ్యకరమైన జీవనశైలి తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. కంపెనీలు కూడా తమ ఉద్యోగుల శ్రేయస్సు కోసం సరైన చర్యలు తీసుకోవాలి. పని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. హన్ జాంగ్-హీ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోవడం టెక్ పరిశ్రమకు తీవ్ర నష్టమే. ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అంటున్నారు.

Also Read : అదిరిపోయే ఫీచర్లతో మిడ్ రేంజ్ స్టార్మ్ ఫోన్లను లాంచ్ చేసిన శామ్ సంగ్