Sambasivarao : ఎంటర్టైన్మెంట్ చానల్స్.. కొత్త సినిమాను టెలికాస్ట్ చేస్తున్నప్పుడు.. భారీగా ప్రచారం చేస్తుంటాయి. టిఆర్పి రేటింగ్స్ పెంచుకోవడానికి కొత్త కొత్త టీజర్లను వదులుతుంటాయి . ఇప్పుడు ఆ బాధ్యతను న్యూస్ ఛానల్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న న్యూస్ ఛానల్సన్నీ ఏదో ఒక పార్టీ స్టాండ్ తీసుకోవాల్సిన దుస్థితి. యాజమాన్యాల పొలిటికల్ ఆసక్తులు.. రకరకాల లెక్కలు దీని వెనుక ఉంటాయి. దేశంలో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ జాడ్యం ఉంది.
Also Read : సాంబశివ.. నీ “పచ్చ”పాతం పాడుగాను…
తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దేశం పార్టీకి డప్పు కొట్టే చానల్స్ చాలానే ఉన్నాయి. అందులో ముందు వరుసలో ఉంటుంది బి.ఆర్ నాయుడి టీవీ 5. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో టీవీ5 విశేషంగా సహాయం చేసింది. వైసిపి నేతలను ఎండగట్టడంలో కీలక పాత్ర పోషించింది. అందువల్లే బి ఆర్ నాయుడు చేసిన సేవలను గుర్తిస్తూ చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమించారు. ఇక ఇటీవల తిరుమలలో చోటుచేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో బిఆర్ నాయుడు పై విమర్శలు వ్యక్తమైనప్పటికీ.. ఆ తర్వాత చంద్రబాబు తనదైన చాకచక్యంతో డైవర్ట్ చేశారు.. టీవీ5 చానల్ లో మూర్తి కంటే ముందు నుంచే సాంబశివరావు ఉన్నారు. సాంబశివరావు టిడిపికి అనుకూలంగా తన వాదనను గట్టిగా వినిపించడంలో.. ప్రైమ్ టైంలో డిబేట్ ను రక్తి కట్టించడంలో సిద్ధహస్తుడు. ఏ విషయానికైనా సరే తన సొంత వ్యాఖ్యానాలను జత తీసి.. దానిని సంచలనంగా మార్చగలడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాంబశివరావుకు గట్టి పదవి దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అతడు టీవీ5 నుంచి బయటికి వెళ్లిపోయాడు. తర్వాత ఏదో పెట్రోల్ బంక్ వివాదంలో ఆయన పేరు వినిపించింది. టీవీ 5 నుంచి అతడు వెళ్లిపోయిన తర్వాత.. ఆ స్థాయిలో ప్రైమ్ టైం డిబేట్ ను నిర్వహించే సత్తా మరొకరికి లేకపోయింది. సాంబశివరావు లేని లోటు అలాగే కనిపించింది.
చర్చలు జరిగాయి?
టీవీ5 మేనేజ్మెంట్ ఎలాంటి చర్చలు జరిపిందో తెలియదు కాని.. సాంబశివరావు మళ్లీ అందులోకి వస్తున్నాడట. ఇదే విషయాన్ని టీవీ5 మేనేజ్మెంట్ తన సామాజిక మాధ్యమాల వేదికలలో పోస్ట్ చేసింది..హీ ఈజ్ బ్యాక్ అంటూ యాష్ ట్యాగ్ తో ఓ పోస్ట్ చేసింది. అందులో సాంబశివరావు ఫోటోను కూడా పోస్ట్ చేసింది. దీంతో తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా సర్కిళ్లల్లో సంచలనం నమోదయింది. టీవీ5 మేనేజ్మెంట్ జరిపిన చర్చలు సఫలం కావడంతోనే సాంబశివరావు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది.. ప్రశ్నించే గొంతుక మళ్ళీ వస్తోందని టీవీ 5 మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఏపీలో టీవీ5 ప్రశ్నించే పరిస్థితి లేదు. తెలంగాణలో మాత్రమే ఆ అవకాశం ఉందేమో.. రేవంత్ రెడ్డికి బి.ఆర్ నాయుడు అత్యంత ఇష్టమైన వ్యక్తి. అలాంటప్పుడు సాంబశివరావు ప్రశ్నించే గొంతుక ఎలా అవుతాడో టీవీ5 మేనేజ్మెంట్ కే తెలియాలి. తను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే రేవంత్ రెడ్డి బిఆర్ నాయుడుని కలిశారు. అంతకుముందు పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కూడా భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య చర్చలు ఏం జరిగాయో తెలియదు.. కాకపోతే రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్రకు విశేషమైన కవరేజ్ లభించింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా సాగిస్తున్న పరిపాలన విషయంలోనూ రేవంత్ రెడ్డికి టీవీ5 మెరుగైన కవరేజే ఇస్తోంది. అలాంటప్పుడు ప్రశ్నించే గొంతుకగా సాంబశివరావు ఎవరిని ప్రశ్నిస్తాడనేది తెలియాల్సి ఉంది.
Also Read : 2024కు బీజేపీ రెడీ.. స్కెచ్, టీం సిద్ధం