
వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి డామినేషన్ కొనసాగుతోంది. పార్టీలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఆయన చేయి ఉండాల్సిందే. చివరికి ముఖ్యమంత్రి వ్యవహారంలో కూడా ఆయనదే పైచేయి. దీంతో సమస్యలు వస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా సీఎం దృష్టికి అన్ని విషయాలు చేరడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు విలేకరుల సమావేశాల్లో ఏం మాట్లాడాలన్నా సజ్జలనే నిర్ణయిస్తారని చెబుతున్నారు. దీంతో పార్టీకి ఎదురుదెబ్బలే తగులుతున్నాయని సొంత పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. సజ్జల కేవలం ప్రభుత్వ సలహాదారు మాత్రమే. కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని హల్ చల్ సాగిస్తున్నారని పేర్కొంటున్నారు. పరిషత్ ఎన్నికల రద్దుపై హకోర్టు నిర్ణయాన్నిసైతం సజ్జలనే ఖండించారు. అసలు ప్రభుత్వ విషయాలు పట్టించుకోవడానికి ఆయనెవరు? ఆయనకు ఏం అధికారముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. సలహాదారు అయితే అన్ని విషయాలు పట్టించుకోవాలా? అని సంశయిస్తున్నారు.
ప్రభుత్వంలో ఏ అధికారిని బదిలీ చేయాలన్నా సజ్జల డామినేషనే నడుస్తోంది. ప్రభుత్వంలోని కీలక శాఖ అధికారులు ఎప్పుడో డమ్మీ అయిపోయారు. తన మనుషుల్ని కొందరిని వివిధ విభాగాల్లో నియమించుకుని అజమాయిషీ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి మాయని మచ్చ అవుతోందని బహిరంగంగానే చెబుతున్నారు. కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు సంతకాలకే పరిమితమైపోయారు. సజ్జల వర్గానిదే పైచేయిగా ఉంది. దీంతో ప్రభుత్వానికి పరోక్షంగా దెబ్బ తగిలే అవకాశాలు లేకపోలేదు.
సజ్జల డామినేషన్ ప్రభుత్వంలోనూ. పార్టీలోనూ ప్రకంపనలే సృష్టిస్తోంది. పలువురు నేతలు బాహాటంగానే చెబుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మాట వినని వారిని ఇంటికి పంపిస్తూ తన మాట నెగ్గించుకుంటున్నారు. వారు ఎవరైనా సరే చివరికి రెడ్డి సామాజిక వర్గమైనా సరే చెప్పిన మాట వినకపోతే అంతే సంగతి అంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సజ్జల డామినేషన్ వ్యవహారంపై పార్టీ పట్టించుకుని ఆయన స్థానమేమిటో చెప్పి దూరంగా ఉంచాలని పలువురు నేతలు భావిస్తున్నారు.