Homeజాతీయ వార్తలుSaibaba Idol : వారణాసిలో సాయిబాబా విగ్రహాల తొలగింపు.. భక్తులు ఏమంటున్నారు.. అసలేంటి గొడవ ?

Saibaba Idol : వారణాసిలో సాయిబాబా విగ్రహాల తొలగింపు.. భక్తులు ఏమంటున్నారు.. అసలేంటి గొడవ ?

Saibaba Idol : ఇటీవల కాలంలో తిరుపతి లడ్డూ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దేశంలో మరో వివాదం తెరమీదకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో సాయిబాబా విగ్రహాల తొలగింపు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఏం జరుగుతుంది.. ఎందుకు విగ్రహాలు తొలగిస్తున్నారో తెలియాలంటే ఈ వార్తా కథనం చదవాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 14 ఆలయాల్లోని సాయిబాబా విగ్రహాలను ‘సనాతన్ రక్షక్ సేన’ అనే సంస్థ తొలగించింది. మరికొందరు సాయిబాబా విగ్రహాలకు ముసుగులు వేశారు. అజయ్ శర్మ అనే వ్యక్తి ఈ సనాతన్ రక్షక్ సేనకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే వారణాసిలోని మరో 28 ఆలయాల్లోని సాయిబాబా విగ్రహాలను తొలగించడమే లక్ష్యంగా ఈ సంస్థ ముందుకు సాగుతోంది.

సాయిబాబా విగ్రహాల తొలగింపుపై అజయ్ శర్మ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సాయిబాబా భక్తులు ఆయనకు సంబంధించిన దేవాలయంలో మాత్రమే పూజలు చేయాలి. సనాతన ధర్మం గురించి తెలియని కొందరు ఇతర దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలను ప్రతిష్టించారు. చనిపోయిన వ్యక్తి విగ్రహం.. గుడిలో ఉండకూడదు. సనాతన ధర్మంలో ఇది లేదు. సూర్యుడు, విష్ణువు, శివుడు, శక్తి, గణేశుడు.. ఈ ఐదుగురు దేవుళ్లను, దేవతా విగ్రహాలను మాత్రమే ఆలయంలో ప్రతిష్టించి పూజించాలి. మరోవైపు ఈ అంశంపై శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కూడా స్పందించారు. సాయిబాబా హిందూ దేవుడు కాదు. ప్రాచీన గ్రంథాలలో సాయిబాబా పేరు ప్రస్తావన లేదు. అసలు సాయిబాబా ఎవరు? ఆయన భగవంతుడు కాదు. మీరు పూజ చేయాలనుకుంటే ఇంట్లోనో.. మరోచోటనో పెట్టి పూజించండి. హిందూ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్న చోట సాయిబాబా విగ్రహాలు పెట్టడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

సాయిబాబాను పూజించేందుకు తాము వ్యతిరేకం కాదని సనాతన్ రక్షక్ సేన సభ్యులు కూడా తెలిపారు. హిందూ దేవుళ్ల ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలను పెట్టేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు సాయిబాబా విగ్రహాల తొలగింపుపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం చర్చనీయాంశమైంది. ఇది రాజకీయంగా కూడా విమర్శలకు తావిస్తోంది. పలువురు రాజకీయ నాయకులు, సాయిబాబా భక్తులు ఈ చర్యలను ఖండించారు. బీజేపీతో పాటు.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఈ చర్యను వ్యతిరేకించాయి. 19వ శతాబ్దినాటి సాధువు అయిన సాయిబాబాను అగౌరవపరిస్తే సహించేది లేదంటూ హెచ్చరించాయి. సాయిబాబాను అవమానిస్తే సహించేది లేదని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బావన్‌కుళె అన్నారు. సాయి విగ్రహాల తొలగింపు కార్యక్రమాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేశారు.

సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వారిపై షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ కేసులు పెట్టింది. ఇప్పటివరకు నాలుగు చోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు సోషల్ మీడియాలో సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడంపై మహారాష్ట్ర సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ నుంచి నిధులు ఇవ్వలేదంటూ మరో వివాదం సోషల్ మీడియాలో కొనసాగుతోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నిధులు ఇవ్వలేదంటూ గత కొన్ని రోజులుగా కొందరు సోషల్ మీడియాలో దుష్పచారం చేస్తున్నారు. అంతేకాకుండా డబ్బును సంచిలో నింపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా వైరల్ అవుతోంది. షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ నిధులను హిందూ ఆలయాలకు కాకుండా మరో మతానికి ఇస్తున్నారని కొందరు పోస్ట్ చేసిన వీడియో వివాదంగా మారింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular