Chandrababu: దేశవ్యాప్తంగా వామపక్షాల రాజకీయ అస్తిత్వం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘకాలం పాలించిన ఘనత వామపక్షాలది. కానీ మమతా బెనర్జీ రూపంలో వామపక్షాలకు అక్కడ గట్టి దెబ్బ తగిలింది.కేరళలో మాత్రమే ఆ పార్టీ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. మిగతా చోట్ల అనుబంధ సంఘాల ఆందోళనలకు, ప్రజా సంఘాలతో కలిసి పోరాటం చేసేందుకే పరిమితం అయింది. మొన్నటికి మొన్న తెలంగాణలో సిపిఐ బోణీ కొట్టింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఒకచోట గెలుపొందింది. అందుకే జాతీయస్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమితో తన పూర్వ వైభవానికి తహతహలాడుతోంది. ఏపీలో మాత్రం చంద్రబాబుతో కలిసి వెళ్లడం ద్వారా ఓట్లు, సీట్లు పొందాలని చూస్తోంది. ఇందుకు అవసరమైతే త్యాగానికి సైతం సిద్ధపడడం విశేషం.
జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. బిజెపి కోసం ఎదురుచూస్తోంది. అటు ఎన్డీఏ భాగస్వామి పక్షమైన జనసేన సైతం బిజెపిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఇంతవరకు బిజెపి నుంచి స్పష్టత లేదు. బిజెపి రాకుంటే తాము సిద్ధంగా ఉన్నామని వామపక్షాలు సంకేతాలు పంపుతున్నాయి. చంద్రబాబు, పవన్ లు ఇండియా కూటమిలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ సైతం మద్దతు తెలుపుతుందని మధ్యవర్తిత్వం వహిస్తోంది. కానీ ఎటు తేల్చుకోలేని డైలమాలో చంద్రబాబుతో పాటు పవన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో వామపక్షాలు భారీ స్కెచ్ వేసాయి. జగన్ సర్కార్ పై పోరాడేందుకు సిద్ధపడ్డాయి.
వామపక్షాలకు ఉద్యోగ, కార్మిక వర్గాల్లో పట్టు ఎక్కువ. ట్రేడ్ యూనియన్స్, ప్రజా సంఘాలు వారి చేతుల్లో ఉంటాయి. వామపక్షాల అస్తిత్వాన్ని కాపాడేది కూడా ఆ రెండు వర్గాలే. సంఘాల బలోపేతానికి కార్మికులు, ఉద్యోగులు ఉదారంగా విరాళాలు ఇస్తుంటారు. తమ జీవితంలో కొంత మొత్తాన్ని కేటాయిస్తుంటారు. అలా వచ్చిన విరాళాలతోనే వామపక్షాలు, ప్రజా సంఘాలు నడిచేవి. అలా వచ్చిన వాటితోనే ఉద్యోగులు, కార్మికుల గురించి వామపక్షాలు పోరాడేవి.ప్రతి ఉద్యోగ వర్గం, కార్మిక వర్గం వెనుక వామపక్షాలు గట్టిగా నిలబడతాయి. ఆ నమ్మకంతోనే ఎక్కువమంది లెఫ్ట్ పార్టీల వెంట నడుస్తారు.
అయితే ఏపీలో అస్తిత్వం కోసం పోరాడుతున్న వామపక్షాలు తమ బలాన్ని ఉపయోగిస్తున్నాయి. చంద్రబాబు కోసం త్యాగం చేస్తున్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కార్మిక వర్గాలు సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు వరుసగా సమ్మెబాట పడుతున్నారు. అయితే దీని వెనక ఉన్నది మాత్రం వామపక్షాలే. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ముదిరితే జగన్ సర్కార్ ప్రజల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఆ వ్యతిరేకత చంద్రబాబుకు ప్లస్ గా మారుతుంది. మొత్తం ప్రభుత్వ వ్యతిరేకత పోలరైజ్ అవుతుంది. అప్పుడే కూటమిలోకి వామపక్షాలను తీసుకునేందుకు చంద్రబాబుతో పాటు పవన్ ఒప్పుకునే అవకాశం ఉంది. అందుకే రాజకీయ ప్రయోజనాల కోసమే వామపక్షాలు తమ బలాన్ని త్యాగం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.