Visakha Real Estate
Visakha Real Estate: విశాఖలో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టినా… ఇటీవల ధరలు పెరుగుతూ వచ్చాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ వాణిజ్య మ్యాగజైన్ ప్రముఖంగా ప్రచురించింది. టిడిపి ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధానిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 29 గ్రామాలకు సంబంధించి భూముల ధరలు అమాంతం పెరిగాయి. సెంటు వేళల్లో ఉండగా.. ఒక్కసారిగా కోట్లకు చేరుకున్నాయి. అయితే విశాఖకు పాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత ఇక్కడ కూడా ధరలు పెరిగాయి. అయితే కోర్టు కేసులు కారణంగా రాజధాని ఏర్పాటు ఆలస్యమైంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. అయితే ఇటీవల కొన్ని రకాల చర్యలతో ధరలు పెరిగినట్లు అంతర్జాతీయ వాణిజ్య మ్యాగజైన్ ప్రత్యేక కథనం ప్రచురించడం విశేషం.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖకు పెద్ద గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంది. ఇది లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్, టూరిజం, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. మధురవాడ, కాపులుప్పాడలో అదా నీ గ్రూప్ చేపట్టిన ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, బిజినెస్ పార్కులు ఇతర కీలక కంపెనీలను ఆకర్షించే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ రియల్ రంగం బాగా వృద్ధి చెందుతుందని కథనంలో చెప్పడం విశేషం.
విశాఖ- భోగాపురం ఎయిర్ పోర్ట్ ఆరు లైన్ల బీచ్ కారిడార్ తో స్వరూపమే మారిపోనుంది. దీనివల్ల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తో కనెక్టివిటీ భారీగా పెరగనుంది. దీంతోపాటు బీచ్ ఫ్రంట్స్, రిసార్టులు, హోటల్లు, ఎం ఐ సి కన్వెన్షన్ సెంటర్ల వంటి పర్యాటక వసతులు పెరుగుతాయి. దీనికి తోడు గ్రీన్ ఫీల్డ్ రాయపూర్ విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ వే 464 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. ఇది ఎకనామిక్ క్యారీడార్ గా నిలవనుంది. 2025 నాటికి పూర్తి కానుంది. విశాఖ నగరం ఏపీలో అతిపెద్ద కాస్మోపాలిటన్ నగరం. పోర్ట్ సిటీ తో పాటు పారిశ్రామిక హబ్ గా కూడా ఉంది. దీంతో నగరంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఎంతో మక్కువ చూపుతున్నారు. దీని ఫలితంగా రియల్ బూమ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని సదరు అంతర్జాతీయ వాణిజ్య మ్యాగజైన్ ప్రత్యేక కథనంలో పేర్కొంది.