ఎడారి రాజకీయాలు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈనెల 14నుంచి రాజస్థాన్లో అసెంబ్లీ నిర్వహించుకునేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన సంగతి తెల్సిందే. మరో నాలుగురోజుల్లో అసెంబ్లీ సమావేశాలకు ప్రారంభం కానుండటంతో రాజస్థాన్ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. గడిచిన నెలరోజులుగా రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటి సీఎం సచిన్ పైలట్ మధ్య నెలకొన్న వివాదాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టాయి.
Also Read: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జికీ కరోనా..
సచిన్ పైలట్ తనవర్గం నేతలతో కలిసి సీఎం అశోక్ గ్లెహ్లాట్ పై తిరుగుబాటు చేశారు. స్వతంత్రుల మధ్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంతపార్టీ నేతలే ఝలక్ ఇచ్చారు. సచిన్ పైలట్ బీజేపీ నేతలతో కలిసి తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించారని సచిన్ వర్గంపై ఆరోపణలు చేయడంతో వీరిమధ్య వివాదం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగిన సచిన్ పైలట్, తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ప్రయత్నించినా వారు ససేమిరా అనడంతో రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది.
అయితే సీఎం అశోక్ గెహ్లాట్ మాత్రం తనకు పూర్తిస్థాయి మద్దతు ఉందని.. బీఎస్పీ సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నారని తొలి నుంచి చెబుతున్నారు. దీంతో బీఎస్పీ అధినేత మాయవతి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఓటింగ్ నిర్వహిస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేసేలా విప్ జారీ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో అలర్టయిన సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శతవిధలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా సచిన్ వర్గాన్ని బుజ్జిగించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
సచిన్ పైలట్ మాత్రం సీఎం అశోక్ గెహ్లాట్ కు మాత్రమే తాము వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీకి కాదని తేల్చిచెబుతున్నారు. అంతేకాకుండా తాను బీజేపీలో చేరిదిలేదని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే సచిన్ పైలట్ తో రాహుల్ గాంధీ మరోసారి సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం 1.00గంటకు ఢిల్లీలో సచిన్ వర్గంతో రాహుల్ బేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రియాంకగాంధీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండుగంటలపాటు పార్టీ భవిష్యత్ తదితర కార్యాచరణపై వీరంతా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ బేటిలో సచిన్ పైలట్ ఎట్టకేలకు అధిష్టానం బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఈమేరకు సచిన్ పైలట్ వర్గంతో సీఎంకు రాజీ కుదిర్చినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: ట్రైన్ ప్రయాణానికి 9 రూల్స్!
ఇదిలా ఉంటే బీజేపీ అధిష్టానం కాంగ్రెసులో నెలకొన్న సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. సచిన్ పైలట్ వర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. అయితే బీజేపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. అశోక్ గెహ్లాట్ తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో రాజస్థాన్ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అయితే రాజస్థాన్ రాజకీయ చదరంగంలో ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు పావులుగా మారుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక రాహుల్ రాయబారం ఏమేరకు ఫలించిందనేది మాత్రం ఆగస్టు 14తో తేలిపోవడం ఖాయం కన్పిసుంది.