
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అసలైన లబ్ధిదారులకే చేరాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వారే గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేయడం.. వారికి పథకాలు చేరవేయడం కూడా వారిదే బాధ్యత. అందుకే.. వారు వాలంటీర్లు మాత్రమే కాదు జగన్ సైన్యం అని కూడా చెప్పొచ్చు. మొత్తం రెండున్నర లక్షల మంది వాలంటీర్లను జగన్ నియమించారు. ఒకరకంగా మానసపుత్రికలా భావించే ఈ వ్యవస్థలో పనిచేస్తున్న వాలంటీర్లకు ప్రభుత్వం ఇస్తోంది కూడా రూ.ఐదు వేలే.
ఈ రోజుల్లో రూ.5 వేలు అంటే అది చాలా వరకు తక్కువే. కానీ.. తాము ప్రభుత్వంలో ఉన్నామని.. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామనే ధీమా వాలంటీర్లలో కనిపిస్తోంది. ఎప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించకపోతుందా.. తమకూ మంచి జీతాలు రాబోతాయా అన్న ఆశల్లోనే బతుకుతున్నారు వారంతా.
వాలంటీర్లు ముందు నుంచీ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటున్నారు. ఇప్పుడు వారంతా ఎంతో కీలకం కూడా అయ్యారు. వారు లేనిదే ప్రభుత్వ పథకాలు కొనసాగే పరిస్థితి లేదు. అంతేకాదు.. ఎన్నికల్లోనూ వైసీపీ గెలుపునకు వీరే ప్రధానం అవుతున్నారు. వీరు చెబితేనే వైసీపీకి ఓట్లు పడుతున్నాయనే అభిప్రాయం కూడా ఉంది. ముఖ్యంగా మొన్నటి లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగడం వెనుక వీరి ప్రాముఖ్యం ఎంతగానో ఉంది.
అయితే.. కొన్నిచోట్ల వైసీపీ నేతలకు వాలంటీర్లు ఇబ్బందిగా మారారట. ప్రభుత్వం తరఫున నియామకమైన వాలంటీర్లు ప్రత్యర్థి పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా.. విజయనగరం జిల్లాకు చెందిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పుష్ప శ్రీవాణి స్పందిస్తూ వాలంటీర్లలో పది శాతం మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని బాంబు పేల్చారు. వారు పథకాలు అమలు చేయాలి.. ప్రభుత్వానికి, ప్రజలకు అనుబంధంగా ఉండాలి కానీ.. ఇలా రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధినేత జగన్ ఎలా స్పందిస్తారో.. ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.