ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ సర్వీస్.. ఇండియన్ పోలీస్ సర్వీస్.. వీటిని అందుకోవాలంటే ఎంత కఠోర సాధన చేయాలో చదువుకున్న ప్రతిఒక్కరికీ తెలుసు. ఎంతో ఇష్టపడి.. దానికి తగినంత కష్టపడి.. అహోరాత్రులు శ్రమిస్తే తప్ప, ఆ స్థాయికి చేరుకోవడం అసాధ్యం. వాటిని సాధించిన తర్వాత.. ప్రజలకు తమదైన రీతిలో సేవలు అందిస్తూ.. ఉన్నట్టుండి రాజీనామా చేశారంటే అర్థమేంటీ? ఎంతో ప్రేమించిన కొలువును అర్ధంతరంగా వదిలేసుకున్నారంటే.. కారణం ఏమై ఉంటుందీ? ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామాతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. గత అనుభవాలు కూడా చర్చలోకి వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో రాజీనామా చేసిన ఐఏఎస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జయప్రకాష్ నారాయణ. ఆయన కలెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. సీఎంవోలో కీలక అధికారిగా పనిచేశారు. ఇలా ఎన్నో విభాగాల్లో పనిచేసిన ఆయన.. అన్ని చోట్లా తనదైన ముద్రవేశారు. అయితే.. నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవహరించినప్పుడు ఒత్తిళ్లు చేసేవాళ్లు పెరిగిపోతూనే ఉంటారు. ఇక, రాజకీయ రంగం ఆధిపత్యం చెలాయించే చోట.. దాని తీవ్రత గురించి చెప్పాల్సిన పనేలేదు. ప్రతి పనికిమాలినోడు కూడా.. పైనవాళ్లు మనిషిననో.. కింద వాళ్లకు తెలుసనో చెప్పి.. అధికారులపై జులుం ప్రదర్శించడానికి చూస్తుంటాడు. ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక, పైరవీలు మోయడం ఇష్టం లేకనే తన సర్వీసుకు జేపీ రాజీనామా చేశారని చెబుతారు.
ఆ తర్వాత తన సర్వీసుకు రాజీనామా చేసిన వ్యక్తి లక్ష్మీ నారాయణ. తన ఉద్యోగమైన సీబీఐ జేడీ(జాయింట్ డైరెక్టర్)నే ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన కూడా ఉన్నట్టుండి.. తన సర్వీసును వదిలేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలకు మరింతగా సేవ చేసేందుకే.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వంతు. ఈయన కూడా పనిచేసిన ప్రతిచోటా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్.. అణగారిన వర్గాలకు చెందిన పిల్లలకు భవిష్యత్ మార్గం నిర్దేశించడంలో.. వారిలో తగిన స్ఫూర్తి నింపడంలో సక్సెస్ అయ్యారు. అలాంటి అధికారి ఉన్నట్టుండి రాజీనామా చేయడం వెనుక.. రాజకీయ ఒత్తిళ్లే ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
పైకి ఇది ఒకరిద్దరి సమస్యగానే కనిపించొచ్చుగానీ.. సూక్ష్మంగా పరిశీలించినప్పుడే అసలు తీవ్రత తెలుస్తుంది. పోలీసు వ్యవస్థ కావొచ్చు.. మరొకటి సర్వీసు కావొచ్చు.. యువకులుగా ఉన్నవారంతా నీతి, నిజాయితీతో ప్రజలకు ఏదో చేయాలనే చేరతారని గుర్తించాలి. స్వార్థపు ఛాయలు పూర్తిగా మనసులో ఇంకనటువంటి యువకులు.. దేశం, సమాజం, ప్రజల అభ్యున్నతికి పాటుపడాలనే దృక్పథంతోనే వస్తారు. కానీ.. అవినీతి, అక్రమాలను పెంచి పోషించే మెజారిటీ రాజకీయ నాయకులు వారికి ఆటంకాలు కల్పిస్తుంటారన్నది యథార్థం. కుదరదని చెబితే.. పై స్థాయి నుంచి ఒత్తిళ్లు చేస్తారు. దీంతో.. అసలు విషయాన్ని అర్థం చేసుకునే కొందరు మనకెందుకులే అని ‘సర్దుకు పోవడానికి’ అలవాటు పడిపోతారు. ఒకరిద్దరు మొండి ఘటాలు మాత్రమే.. అందరినీ ఎదిరించి ముందుకు సాగుతారు. వారికి సైతం ఈ ఉద్యోగం ద్వారా ఒరిగేదేమీ లేదనిపించినప్పుడు.. ఇలా రాజీనామాలు చేసేస్తారు.
పైన చెప్పుకున్న ముగ్గురు అధికారులు కూడా ఈ విధంగానే రాజీనామా చేశారన్నది చర్చ. వారి సర్వీసులో ఎక్కడా లోపం లేకపోవడం.. ఎక్కడా అవినీతి మరకలు అంటకపోవడం కూడా వారి పనితీరుకు నిదర్శనం. అయితే.. ఈ ముగ్గురూ రాజకీయాలవైపే అడుగులు వేయడం గమనించాల్సిన మరో సారుప్యత. లోక్ సత్తా పేరుతో ప్రజాచైతన్యానికి కృషి చేసిన జేపీ.. ఆ తర్వాత రాజకీయ పార్టీగా మార్చారు. కానీ.. ఆయన సక్సెస్ కాలేకపోయారు. ఆ తర్వాత జేడీ కూడా రాజకీయాల్లోకి దిగారు. కానీ.. ఆయన కూడా విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కూడా రాజకీయ రంగంవైపే అడుగులు వేస్తున్నట్టు పరోక్షంగా ప్రకటించారు.
పూలే, అంబేద్కర్, కాన్షీరాం బాటలో పయనిస్తానని చెప్పడం ద్వారా.. రాజకీయ వేదికపైకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు పరోక్షంగా తెలిపారు. మరి, ప్రవీణ్ కుమార్ ఎలాంటి ఫలితం నమోదు చేస్తారన్నది ఆసక్తికరం. అయితే.. ఇక్కడ ఒక కీలక విషయం చెప్పుకోవాలి. నిజాయితీగా పనిచేసిన అధికారులకు రాజకీయ వ్యవస్థ, నేతలు అవకాశం ఇవ్వలేదని గుర్తించాలి. రాజ్యాంగానికి కట్టుబడి నీతిగా పనిచేసే అధికారులకు ఈ రాజకీయ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని అర్థం చేసుకోవాలి. అందుకోసమే.. వారు ఎంతో కాలం ఉన్న సర్వీసును వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. వస్తున్నారు. కాబట్టి.. అలాంటి నిజాయితీ పరులను అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రజలదే.