తమిళనాడులో స్టాలిన్ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. తొలిరోజే పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రజల కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పకనే చెప్పారు. అయిదు ప్రతిపాదనలపై సంతకాలు చేశారు. ప్రతి కుటుంబానికి రూ.4 వేలు అందించే ప్రతిపాదనపై తొలి సంతకం చేశారు. ప్రజల అవసరాలు తీర్చేందుకే తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. పేదవారి సంక్షేమమే ప్రధానంగా ముందుకు వెళతామని సూచించారు.
రూ.4200 కోట్లతో ప్రతిపాదనలు
ప్రతి కుటుంబానికి రూ.4 వేల ఆర్థిక సాయానికి రూ.4200 కోట్లు అవసరమవుతాయని భావించారు. దీని కోసం మొదటగా రూ.2 వేలు విడుదల చేశారు. దీంతో పేదవారికి చేయూతనిచ్చేందుకు ఉద్దేశించిన పథకంపై ప్రజలకు జవాబుదారీగా ఉంటామని ప్రకటించారు. కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించాలని సూచించారు. కరోనా ఉధృతి తగ్గే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వాగ్దానాల అమలుకు వడివడిగా
స్టాలిన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు నడుం బిగించారు. తొలిసారిగా అయిదు ఫైళ్లపై సంతకాలు చేసి తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని తేల్చిచెప్పారు. కోవిడ్ నివారణకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేసి తానేమిటో నిరూపించుకున్నారు. పాల ధరలను రూ.3 వరకు తగ్గించారు. సిటీ బస్సుల్లో మహిళలు, విద్యార్థులు, వృద్ధులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు.
పరిపాలనలో..
పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రమాణ స్వీకారం చేసిన క్షణమే పలు నిర్ణయాలు తీసుకుని ప్రజల్లో తనదైన ముద్ర వేశారు. మాటల నాయకుడిని కాదని చేతల వాడినని నిరూపించుకున్నారు. ప్రతిపక్షాలకు సైతం అవకాశం ఇవ్వకుండా సగటు మనిషి బాధలను దూరం చేసే ప్రయత్నంలో భాగంగా ఎంతటి కష్టమైనా భరించాలని భావించారు.