
చైనాలో పుట్టిన మొదటి కరోనా వేవ్ భారత్ ను పెద్దగా ఏం చేయలేకపోయింది. కానీ అగ్రరాజ్యం అమెరికాను, యూరప్ ను అతలాకుతలం చేసింది. అప్పుడు లాక్ డౌన్ తో భారత ప్రధాని నరేంద్రమోడీ దేశంలో కరోనాను నియంత్రించారు. అయితే నాడు మోడీని పొగిడిన వారే ఇప్పుడు రెండో వేవ్ తో వచ్చిన ఉధృతిని చూసి తిట్టిపోసుకున్నాయి. అయితే అగ్రరాజ్యాలన్నీ కూడా మొదటి వేవ్ నుంచి గుణపాఠం నేర్చుకున్నాయి. వ్యాక్సిన్లను ముందస్తుగా ఆర్డర్ ఇచ్చి వారి దేశ ప్రజలకు పంచుతున్నాయి. ఇప్పుడు రెండో వేవ్ ను వారు కంట్రోల్ చేయగలుగుతున్నారు. అదే భారత్ చేయలేకపోయిందని ప్రముఖ ఫార్మా దిగ్గజం శాంత బయోటెక్ ఎండీ వరప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాడు ట్రంప్ ను కరోనాను కంట్రోల్ చేయని పిచ్చోడు అని అందరూ తిట్టిపోశారని.. కానీ అదే ట్రంప్ బిలియన్ డాలర్లను డబ్బును ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ సహా కరోనా టీకా కంపెనీలకు ఇచ్చి అమెరికా జనాభా 35 కోట్లు అయితే 65 కోట్ల వ్యాక్సిన్లను కొనుగోలు చేశారని.. ఇప్పుడు ఆ దేశంలో అందరికీ టీకాలు వేశాక కూడా టీకా మిగిలిపోయిందని వరప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కేంద్రంలోని మోడీ సర్కార్ మన దేశంలోని ప్రధాన టీకా కంపెనీలు అయిన సీరం, భారత్ బయోటెక్ కు నిధులు ఇవ్వలేదని.. వ్యాక్సిన్ సామర్థ్యం పెంచమని ఆదేశించలేదని.. ఉన్న వ్యాక్సిన్లను ప్రపంచదేశాలకు పంచి మూల్యం చెల్లించుకుందని వరప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 135 కోట్ల భారత దేశానికి 300 కోట్ల వ్యాక్సిన్ కావాలని.. అంత సామర్థ్యం ఈ రెండు టీకా కంపెనీలకు లేదని తేల్చిచెప్పారు. దేశంలో కరోనాను నియంత్రించాలంటే కనీసం సంవత్సరం పడుతుందని చెప్పుకొచ్చారు.
అమెరికాలో కేసులు లేకపోవడానికి అసలు కారణం వారి ముందు చూపు అని.. వ్యాక్సిన్లను ముందస్తుగా ఆర్డర్ చేసుకోవడమే ఇప్పుడు అమెరికాకు పెను ముప్పు తప్పించిందని వరప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. దేశంలోని నాయకత్వం ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఎన్నికలకు మొగ్గు చూపి వ్యాక్సిన్లకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చూపిన కారణంగానే ఈ సెకండ్ వేవ్ వచ్చిందని వరప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
https://www.youtube.com/watch?v=lWYe2V4ZmyA