RRR Tickets Are Blocked In Ap: పేద ప్రజలకు తక్కువ ధరకు వినోదం అందించడానికే సినిమా టిక్కెట్ల ధరను తగ్గించాం. ఆన్ లైన్ టిక్కెట్ వ్యవస్థ ను ప్రారంభించాం. చిన్న చిత్రాలను బతికించే్ందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం..కొద్దిరోజుల కిందట వరకూ ప్రభుత్వ పెద్దల నుంచి కింది స్థాయి నాయకులు చేసిన ప్రకటనలివి. ఇవి వినడానికైతే వినసొంపుగా ఉన్నాయే..కానీ శుక్రవారం విడుదలైన ఆర్ఆర్ఆర్’చిత్రం విడులతో ఈ మాటలన్నీ పటాపంచలయ్యాయి. నిబంధనల మాట అటుంచితే టిక్కెట్ ధర రూ.2,000 దాటేసింది. అది కూడా అభిమానులకు దొరకనంతగా టిక్కెట్లు బ్లాక్ అయ్యాయి. దీని వెనుక అధికార పార్టీ నాయకులు ఉండడం నివ్వెరపరుస్తోంది. ఎక్కడికక్కడే థియేటర్లను తమ ఆధీనంలో తెచ్చుకున్న నేతలు ఉదయం బెనిఫిట్ షో నుంచి రాత్రి వరకూ ఐదు ఆటలకు సంబంధించి టిక్కెట్లను బ్లాక్ చేసి విక్రయించారు. దీంతో నందమూరి, కొణిదెల అభిమానులు ఆపసోపాలు పడ్డారు. అధిక ధరకు టిక్కెట్లను వారికి అమ్మి సొమ్ము చేసుకున్నారు.
ఎంపీలు,ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు ప్రమేయం ఎక్కువగా కనిపించింది. విజయనగరంలో స్థానిక ఎమ్మెల్యే అల్లుడు, చీపురుపల్లిలో ఎంపీ కుమారుడు..ఇలా దాదాపు అన్ని ప్రాంతాల్లో థియేటర్లను తమ ఆధీనంలోకి తచ్చుకున్న అధికార పార్టీ నేతల కుటుంబసభ్యులు సినిమాను సొమ్ము చేసుకున్నారు. లాభాలు ఆర్జించుకున్నారు. ఈ విషయంలో థియేటర్ యజమన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడికి గురయ్యారు. ఏంచేయాలో పాలుపోక మల్లగుల్లాలు పడ్డారు. గురువారం నుంచే థియేటర్ యజమాన్యాలపై ఒత్తిడి ప్రారంభించారు. కొందరు ఉదయం బెనిఫిట్షో ప్రారంభం నుంచే టిక్కెట్లు కావాలని ఒత్తిడి పెంచారు. కానీ అప్పటికే టిక్కెట్లు విక్రయించామని చెప్పినా వారు వినలేదు. అధికార దర్పంతో బెదిరింపులకు దిగారు. దీంతో యాజమాన్యాలు మిగతా షోలకు సంబంధించి టిక్కెట్లు వారికి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు.
Also Read: CM KCR- Governor Tamilisai: కేసీఆర్ ను మళ్లీ డిఫెన్స్ లో పడేసిన గవర్నర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. టిక్కెట్ ధరను అమాంతం తగ్గించేశారు. థియేటర్లను అధికారులు చుట్టు ముట్టారు. నిబంధనలను తెరపైకి తెచ్చి థియేటర్లను సీజ్ చేశారు.మరుగుదొడ్లు బాగాలేదని, థియేటర్లో సిట్టింగ్ సవ్యంగా లేదని.. ఇలా ఏ చిన్న కారణాన్ని విడిచిపెట్టలేదు. కేవలం పవన్ పై కోపంతోనే చాలా నిస్సిగ్గుగా వ్యవహరించడం అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. కానీ ఇన్ని ఇబ్బందుల నడుమ కూడా భీమ్లానాయక్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అప్పట్లో పవన్ కు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒకరిద్దరు తప్ప మిగతా ప్రముఖులు మాట్లాడడానికి సాహసించిన పాపానపోలేదు. ఇదే విధంగా నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రానికి సైతం ఇదే ఇబ్బందులు ఎదురయ్యాయి.
కేవలం నాని ఆన్ లైన్ టిక్కెట్ వ్యవస్థను ప్రశ్నించినందుకే ఇబ్బందులు పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. అటు తరువాత పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’సినిమా విషయంలో ప్రభుత్వం కాస్త వెసులబాటు కల్పించింది. పది రోజుల పాటు టిక్కెట్ అదనపు ధరకు విక్రయించుకునేందుకు అనుమతిచ్చింది. అయితే చిత్ర పరిశ్రమపై అభిమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంతా భావించారు. కానీ తీరా సినిమా విడుదలైన తరువాత తొలిరోజు ఆటలను అధికార పార్టీ నాయకులు క్యాష్ చేసుకున్నారు.
అసలు చిత్ర పరిశ్రమపై ఏపీ సీఎం జగన్ కు ఎందుకు కక్ష అన్న చర్చలు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్నాయి. నాపై కోపంతో చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెట్టొద్దని పవన్ కళ్యాణ్ విన్నవించుకున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఎలాగైనా చిత్ర పరిశ్రమను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా సినిమా టిక్కెట్ల ధరలను భారీగా తగ్గించేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కనిష్ఠ ధరకు తగ్గించేసింది. దీంతో సినిమా ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. టిక్కెట్ ధర విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని విన్నవించారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాష్, మహేష్ బాబు, అలీ, ఆర్.నారాయణమూర్తి తదితరులు సీఎం జగన్ ను స్వయంగా కలిసి విన్నవించారు. కాస్తా మినహాయింపులతో జీవోలు జారీచేస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో భీమ్లా నాయక్ సినిమా విడుదల సమీపించింది. కానీ టిక్కెట్ ధర పెంపుపై ఎటువంటి జీవో జారీ చేయలేదు. అయినా పవన్ కళ్యాణ్ తన చిత్రంతో పరిశ్రమకు ధైర్యం నింపాలని భావిస్తూ చిత్రం విడుదల చేశారు. బ్లాక్ బాస్టర్ గా నిలిచి నిజంగా చిత్ర పరిశ్రమకు కొత్త ఊపిరి పోసింది. భీమ్లా నాయక్ విడుదలైన చాలా రోజులకు జీవో జారీచేశారు. ‘ఆర్ఆర్ఆర్’సినిమా టిక్కెట్ ధర పెంచేందుకు అవకాశమిస్తూ..ఏకంగా ఆ సినిమా ద్వారానే వైసీపీ నాయకులు కోట్లాది రూపాయలు ఆర్జించారు.
Also Read: CM Jagan Three Capital Issue: మూడు రాజధానులతో జగన్ మళ్లీ గెలుస్తారా?