వైసిపిలో `ఫైర్ బ్రాండ్’ నేతగా పేరొందిన ప్రముఖ సినీ నటి, నగిరి ఎమ్యెల్యే ఆర్ కె రోజా ఇప్పుడు సొంత పార్టీ నేతలపైననే ఎక్కువగా మండిపడుతున్నారు. ఆమె వరుసగా రెండోసారి గెలుపొందిన నగిరి నియోజకవర్గంలోనే ఆమెకు సొంత పార్టీ వారే ఎసరు పెట్టె ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా చిత్తూర్ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తనకు తెలుపకుండా తన నియోజకవర్గంలో పర్యటించడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే అయిన రోజాకు సమాచారం ఇవ్వకుండా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పుత్తూరులో పర్యటించారు. ఈ విషయం తెలిసిన నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు చెప్పకుండా తన నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని ఆమె ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా పుత్తూరులో ఆకస్మికంగా పర్యటించారు. పుత్తూరులోని అంబేద్కర్ సంఘం తరపున దళితులకు కల్యాణ మంటప స్థల సేకరణ కోసం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఖాళీ భూమిని పరిశీలించారు.
తాను నియోజకవర్గంలోనే అందుబాటులో ఉన్నా కూడా తనను పట్టించుకోకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని రోజా ఆరోపించారు. తనను రాజకీయంగా పక్కకు నెట్టడం కోసమే సొంత పార్టీలోని నియోజకవర్గానికి చెందిన తన ప్రత్యర్థులే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఇదివరలో సహితం పలు సార్లు ఆమె ఆగ్రవేశాలు వ్యక్తం చేయడం తెలిసిందే.
నగరి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక గ్రూపునకు మాత్రమే నారాయణస్వామి మంత్రినా అంటూ రోజా నిలదీశారు. అంటే తన నియోజకవర్గంలోనే సొంత పార్టీలో బలమైన వర్గాలు తనను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె అంగీకరించినట్లు అయింది.