దాదాపు రెండు దశాబ్దాల క్రితం మెయిన్ స్ట్రీమ్ మీడియా, టీవీ ఛానెళ్లు వార్తల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించేవి. ప్రజలకు నిజమైన సమాచారాన్ని వేగంగా ఇవ్వడానికే ప్రయత్నం చేసేవి. అధికారంలో, ప్రతిపక్షంలో ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీలు చేస్తున్న తప్పులను తప్పులుగా, ఒప్పులను ఒప్పులుగా ఎత్తిచూపేవి. దీంతో ప్రజలు కూడా మీడియాను విశ్వసించేవారు. అయితే రానురాను పత్రికలు, టీవీ ఛానెళ్లు పార్టీ రంగు పులుముకున్నాయి.
ఏ వార్తనైనా తమ అనుకూల పార్టీకి అనుకూలంగా మలచడానికి ప్రస్తుతం పత్రికలు, ఛానెళ్లు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ప్రజలు సైతం పత్రికలను, న్యూస్ ఛానెళ్లను నమ్మడం మానేసి న్యూస్ వెబ్ సైట్లపై, సోషల్ మీడియాపై సరైన సమాచారం తెలుసుకోవడం కోసం ఆధారపడుతున్నారు. అయితే ప్రజల ఆలోచనా తీరులో మార్పు వస్తోందే తప్ప పత్రిక, టీవీ ఛానెళ్ల ప్రతినిధుల ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు.
తాజాగా ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు భవిష్యత్తులో విజయం సాధించబోవని చెప్పారు. ఇప్పటికే సీఎం జగన్, సీఎం కేసీఆర్ లకు ఈ విషయం అర్థమైందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కానీ, జగన్ కానీ బీజేపీకి ఎదురెళ్లే ప్రయత్నం చేయరని… జగన్ బీజేపీకి ఎదురు తిరిగితే గతంలో జగన్ పై నమోదైన కేసులను అడ్డం పెట్టుకుని బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఆర్కే పేర్కొన్నారు.
అయితే కేసీఆర్ పై ఎలాంటి కేసులు లేవు. కానీ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాత్రం కేసీఆర్ అవినీతి గురించి ఆధారాలు ఉన్నాయని పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. అయితే నిజంగా ఆధారాలు ఉన్నాయో లేవో మాత్రం ఎవరికీ తెలీదు. దీంతో బీజేపీ స్కెచ్ వేసి కేసీఆర్ ను పదవి నుంచి దింపే ప్రయత్నం చేస్తోందని ఆర్కే అనుమానిస్తున్నారు. అయితే నెటిజన్లు మాత్రం ఆర్కేది కొత్త పలుకు కాదని చెత్త పలుకు అని కామెంట్లు చేయడం గమనార్హం.