మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేశ్ కు పార్టీలో తన తరువాత అంతటి వ్యక్తిగా గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా వేర్వేరు కారణాల వల్ల ఆ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ట్విట్టర్లో ట్వీట్ల ద్వారా అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై విమర్శలు చేసే చినబాబు ప్రత్యక్షంగా విమర్శలు చేయాలంటే మాత్రం తడబడుతుంటారు. లోకేశ్ స్టేజ్ ఎక్కితే ఏం మాట్లాడతాడో అని భయపడాల్సిన పరిస్థితి టీడీపీ నేతల్లో నెలకొంది.
లోకేశ్ కు బాధ్యతలు అప్పగిస్తే పార్టీ నుంచి వెళ్లిపోతామని కొందరు చంద్రబాబుతోనే వ్యాఖ్యానించారంటే లోకేశ్ పై వారిలో ఏ స్థాయిలో నమ్మకం ఉందో సులభంగానే అర్థమవుతుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన లోకేశ్ మంగళగిరిలో విజయం సాధిస్తాడని టీడీపీ నేతలు భావించినా వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఎన్నికల ఫలితాల అనంతరం లోకేశ్ టీడీపీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేరు.
2019 ఎన్నికల ముందు లోకేశ్ బాబు రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేసి పార్టీ బలపడేలా చేయాలని భావిస్తున్నా లోకేశ్ గురించి పూర్తిగా తెలిసిన నేతలంతా లోకేశ్ వాగ్ధాటి, పోరాటపటిమకు భయపడి యాత్రకు ఆదిలోనే బ్రేకులు వేశారు. మరోవైపు చంద్రబాబుకు వయస్సు మీద బడుతోంది. 2024 ఎన్నికల నాటికి ఆయనకు 74 ఏళ్లు వస్తాయి. ఆ వయస్సులో చంద్రబాబుకు రాజకీయాలు చేయాలని ఉన్నా ఆయన శరీరం, ఆరోగ్యం ఏ మేరకు సహకరిస్తాయో చెప్పలేం.
లోకేశ్ ఏదైనా సాధిస్తే పార్టీ పగ్గాలు అప్పగిద్దామని చంద్రబాబు భావిస్తోంటే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అయితే కరోనా తగ్గిన తరువాత లోకేశ్ తో సైకిల్ యాత్ర చేయించి ఆ తర్వాత పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే లోకేశ్ సైకిల్ యాత్ర సక్సెస్ అవుతుందా…? లేక ఆదిలోనే ఆవాంతరాలు ఎదురవుతాయా…? చూడాల్సి ఉంది. చినబాబు పార్టీ పగ్గాలు స్వీకరించాలనే ఆశ సైకిల్ యాత్ర తరువాతైనా సాధ్యమవుతుందో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగక తప్పదు.