పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు టీఆర్ఎస్ నేతలు. ఆయనపై టీడీపీ ముద్ర వేస్తూ ఏజెంటుగా అభివర్ణిస్తున్నారు. కేటీఆర్ సైతం రేవంత్ టీడీపీ కోణంలోనే విమర్శించగా హరీశ్ రావు కూడా అదే తీరుగా పేర్కొన్నారు. టీడీపీని ప్రజలు ఏనాడో దూరం పెట్టారని అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ ముసుగులో మళ్లీ రావడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రేవంత్ ను కాంగ్రెస్ లోకి పంపి తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తునన్నారని విమర్శించారు. దీనికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు.
తాను టీడీపీ నుంచి వస్తే మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. టీడీపీ నుంచి వచ్చానని చెబుతున్నారు కానీ కేసీఆర్, కేటీఆర్ టీడీపీ వారు కాదా? హరీశ్ రావు కాంగ్రెస్ నుంచి రాలేదా? అని విమర్శించారు. టీకాంగ్రెస్ టీడీపీ అయితే టీఆర్ఎస్ కూడా టీడీపీగానే భావించాలన్నారు. తెలంగాణలో ఉన్న మంత్రుల్లో ఎక్కువ మంది మంత్రులు కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే కాదా అన్నారు.
రేవంత్ రెడ్డిపై టీడీపీ ముద్ర వేసి రాజకీయ లబ్ధి పొందాలని భావించినా చివరికి బెడిసికొట్టడంతో హరీశ్ రావు ఏం మాట్లాడలేకపోతున్నారు. టీడీపీని విమర్శిస్తున్నా ఇప్పుడు టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు రమణను పార్టీలో చేర్చుకుని హుజురాబాద్ నుంచి నిలబెట్టాలనే ఆలోచన ఎంత వరకు సమంజసమో ఆలోచించుకోవాలనే మాటలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో టీడీపీని తిట్టి ఓట్లు సంపాదించుకున్న టీఆర్ఎస్ ఇ ప్పుడు కూడా అదే పద్ధతి పాటించాలని చూస్తోంది. చంద్రబాబును దోషిగా చూపించి ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని భావిస్తోంది. రేవంత్ రెడ్డిని విమర్శించి లబ్ధిపొందాలని చూస్తోంది. అనుకున్నది ప్రతి సారి జరగదు. ఒక్కోసారి బెడిసికొడుతుంది. మొత్తానికి టీడీపీ తెలంగాణలో లేకున్నా ప్రస్తుతం వార్తల్లో తన ఉనికి మాత్రం చాటుకుంటోంది.
రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అన్ని పార్టీలు హుజురాబాద్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ పుంజుకోవడం, ఇటు షర్మిల పార్టీ ప్రారంభం కావడంతో ఎన్నికల్లో ప్రభావం ఏ మేరకు ఉంటుందో అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనే క్రమంలో తమ ఉద్దేశాలు, విధానాలు ఉండాలనే తాపత్రయంతో అన్ని పార్టీలు ముందుకు కదులుతున్నాయి.