
-నీటిని అడ్డగోలుగా తరలిస్తుంటే ఎందుకు నోరు మెదపరు?
– ఎపీలో పెండింగ్ ప్రాజెక్టులపై ఉద్యమం ఏ ఆ 3 మండలాలు తెచ్చే దమ్ముందా?
– ముఖ్యమంత్రి జగన్కు సోమువీర్రాజు ప్రశ్నల వర్షం · కర్నూలులో భాజపా ముఖ్యనాయకుల రౌండ్ టేబుల్ సమావేశం
కృష్ణాజలాలను కేసీఆర్ అడ్డగోలుగా తరలిస్తుంంటే ఎందుకు అడ్డుకోవడం లేదని ముఖ్యమంత్రి జగన్ను భాజపా నాయకులు ప్రశ్నించారు. ప్రజల మద్దతు కోల్పోయి ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేక కృష్ణానదీ జలాలపై వివాదాలను సృష్టిస్తూ, ప్రజల్లో సెంటిమెంట్ రాజేస్తున్న కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. విభజన సమయంలో ఆదాయ వనరులున్న రాజధాని హైదరాబాద్ సహా నీటి వనరులు సమృద్ధిగా ఉన్న దమ్ముగూడెం, చర్ల, వాజేడు, భద్రాచలం మండలాలను తీసుకుని ఇప్పుడు ఎపీకి రావాల్సిన కృష్ణానీటిపైన కేసిఆర్ కన్నేశారని మండిపడ్డారు. నీటి వివాదాలపై రాజ్యాంగ వ్యవస్థలకు వాదనలు వినిపించక మధ్యలో ఎందుకు ప్రధానిని బాధ్యులు చేస్తున్నారని విమర్శించారు. వివాదాస్పద ప్రాజెక్టుల జోలికి పోకుండా రాయలసీమతో సహా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అధ్యక్షతన రాయలసీమ నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలపై భాజపా ముఖ్యనాయకుల రౌండ్ టేబుల్ సమావేశం కర్నూలులో శుక్రవారం జరిగింది. ఈ సమావేశం అనంతరం భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు మీడియాతో ఇలా మాట్లాడారు..
సాగరకు వచ్చే 200 టీఎంసీల నీటిని తన్నుకుపోయిన కేసీఆర్ ఇప్పుడు ఎపీకి రావాల్సిన కృష్ణా నీటిని వాడేసుకుంటున్నారు. 2019 జగన్ ప్రమాణ స్వీకారం సమయంలో ముఖ్యఅతిధిగా వచ్చిన కేసీఆర్ కృష్ణాజలాల వాడకం విషయంలో ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా ముందుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు ఆయన ఆ మాటలను మర్చిపోయారా? ఆయనకు జ్ఞాపకం తగ్గిందా? లేక జగను జ్ఞాపకం చేయడానికి ఇలా ప్రవర్తిస్తున్నారా? ఎందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కృష్ణాజలాలు అడ్డగోలుగా కేసీఆర్ వినియోగిస్తుంటే నోరుమెదపడం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణపై ఎందుకు మాట్లాడనుంటున్నారు. షర్మిల తెలంగాణలో పార్టీపెట్టి ఒక్కచుక్క నీటిని ఎపీకి వదలమని తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు? ఈ మూడు పార్టీల వైఖరిని భాజపా ప్రశ్నిస్తోంది. రాజధానిని కోల్పోయి హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఎపీ కోల్పోయింది. తూర్పుగోదావరిలోని భద్రాచలం, దమ్ముగూడెం, చర్ల, వాజేడు మండలాల్ని తెలంగాణ తీసుకుంది. దమ్ముగూడెం కోల్పోవడం వల్ల సాగర్కు వచ్చే 200 టీఎంసీల నీటికి కోల్పోయాం. ఆ నీటితో రాయలసీమ కరవుతీరేది. కెసిఆర్ ఏ ముఖం పెట్టుకుని పోలవరం నుంచి 45 టీఎంసీల నీటిని వాటాగా అడుగుతున్నారు.
కేసీఆర్ సోనియా కాళ్లు పట్టుకుని ఆ 3 మండలాలు తీసుకుని ఎపీకి తీవ్ర ద్రోహం చేశాడు. ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంటే ఒక్క చుక్క నీరు పోకుండా భాజపా తీవ్రమైన పోరాటం చేస్తుంది. ఇద్దరు సీఎంలు తెలివిగా ప్రధానికి లేఖలు రాస్తున్నారు. విపరీత మనస్తత్వం గల సీఎంలు ఉండవచ్చని ఆలోచనతోనే వాజ్పేయి నదుల అనుసంధానం వంటి పరిష్కారమార్గాన్ని తెచ్చారు. కృష్ణాబోర్డు, బచావత్ ట్రిబ్యునల్ వంటి రాజ్యాంగవ్యవస్థలు ఉండగా లేఖలు ఎవరికి రాస్తారు? 2019లో నదుల వివాదాల పరిష్కారానికి బిల్లును కూడా సవరించారు. ఇంత పకబందీ చట్టాలు, వ్యవస్థలు ఉన్నా ఎందుకు లేఖలు రాస్తారు? రాత్రిళ్లు ఫోన్లలో మాట్లాడుకుని లేఖలు రాస్తున్నారా?
తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితులు ఏర్పడటంతో ఆ ఇబ్బందులు అధిగమించడానికి కేసీఆర్ మరోసారి తెలంగాణ వాదాన్ని తెరమీదకు తెచ్చారు. తెలంగాణ అంశాలను మాట్లాడమని ఇద్దరు సిఎంలు అంటున్నారు. వివాదాలు చేస్తున్నప్పుడు స్పందించి గట్టిగా సమాధానం చెప్పడం, బోర్డుకు వాదనలు వినిపించాల్సిన పరిస్థితుల్లో మాట్లాడననడం ఓడ్రామా. ఈ డ్రామా తెరదించేందుకు వివాదాలకు సంబంధం లేని రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటిని పూర్తిచేసేలా వత్తిడి తెస్తాం. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్తికాని ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించాం. ఈ అంశంపై రాబోయే రోజుల్లో ఉద్యమం చేస్తాం. పూర్తిచేయాల్సిన వాటి గురించి ఆలోచించకుండా వివాదాలు సృష్టించే ప్రాజెక్టులు ఎందుకు చేపట్టారని భాజపా ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై భాజపా ముందుకెళ్తుంది. విజయవాడలో త్వరలో మరో రౌండ్ టేబుల్ సదస్సును నిర్వహిస్తాం. ప్రతిజిల్లాలో నీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలని వత్తిడి తెస్తాం.
ప్రజా ప్రయోజనాలను విశ్వరించొద్దు: సిఎం రమేష్, రాజ్యసభ సభ్యులు కృష్ణానీటిని దౌర్జన్యంగా వాడేసుకోవడంతోపాటు ఎపీపై తెలంగాణ నాయకులు అంతగా రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఎపీ ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించకుండా తెలంగాణకు సమాధానం చెప్పని సిఎం జగన్ వైఖరిని భాజపా ప్రశ్నిస్తోంది. కేసీఆర్, జగన్ ల మధ్య విభేధాలను భాజపాకు చుట్టి రాజకీయంగా లబ్దిపొందాలనుకోవడం సరికాదు.
పెండింగ్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి :టికే వెంకటేష్ రాజ్య సభ్యులు
నదీ జలాల నీటి పంపిణీ విషయంలో 2015లో భాజపా, తెరాస, తెదేపా ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చాయి. కృష్ణానీటిని ఉపయోగించుకునే హక్కు మనకుంది. కేసీఆర్ పోలీసులు పెట్టి నీటిని వాడుకుంటుంటే, మీరెందుకు పోలీసులను పెట్టి నీటిని తీసుకురావడం లేదు. రాయలసీమ ప్రజలు కూడా ఈ విషయంలో అండగా ఉంటారు. రెండేళ్లుగా రాయలసీమ ప్రాజెక్టులపై ఎంత కేటాయించారో, ఎంత ఖర్చుచేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎల్ఎల్సీ ప్యారలెల్ కెనాల్ తవ్వాలి. వేదవతి ప్రాజెక్టు పూర్తిచేయాలి. సిద్ధేశ్వరం ప్రాజక్టుపై జాతీయ రహదారి నిర్మించేందుకు కేంద్రం అంగీకరించింది. బ్యారేజ్ కం బ్రిడ్జిని నిర్మిస్తారు. దీని రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన చర్య తీసుకోవాలి. రాయలసీమకు నిరందుతుంది.
సమావేశంలో భాజపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునిల్ డియోధర్, ఎమ్మెల్సీ వాకాడి నారాయణరెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, రావెల కిషోర్ బాబు, చంద్రమౌళి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పార్ధసారధి, జైన్, జయరాజు, జాతీయ నాయకులు డాక్టర్ పార్ధసారధి, రాష్ట్ర కార్యదర్శులు నాగోతు రమేష్నాయుడు, నీలకంఠ, సీనియర్ నాయకులు కపిలేశ్వరయ్య, కర్నూలు జిల్లా అధ్యక్షులు రామస్వామి, నంద్యాల పార్లమెంటు అధ్యక్షులు శ్రీకాంత్రెడ్డి, కడప జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు రామచంద్రుడు, అనంతపురం జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి శ్రీనివాసరావు, హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు భాస్కరరెడ్డి, తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు దయాకరరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి, ఎస్సీమోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసే దేవానంద్, ప్రత్యేక ఆహ్వానితులుగా పలువురు నాయకులు పాల్గొన్నారు.