
అభం శుభం తెలియని చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉయ్యాలలో నిద్రపోతున్న 15 రోజుల శిశువును ఎత్తుకెళ్లి నీటి ట్యాంకులో పడవేసిన ఉదంతం నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని రంగనాయకులపేట యాదవ వీధిలో ఉండే విద్యావతి, వెంకటేశ్వర్లు దంపతులకు రెండేళ్ల కుమార్తె ఉండగా, జూన్ 24న ఆడ శిశువు జన్మించింది. శుక్రవారం ఉదయం ఉయ్యాలలోని చిన్నారి అదృశ్యం కావడంతో చుట్టుపక్కల వెతికారు. చివరకు పక్కన నివాసం ఉంటున్న బంధువు జ్యోతి ఇంటి మిద్దెపై నీటి ట్యాంకులో చిన్నారి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. సంతపేట పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య కేసుగా నమోదు చేశారు.