
వచ్చేవారెవరు..? నాతో చచ్చేవారెవరు..? అన్న బాహుబలి సినిమాలోని డైలాగులాంటి మాటలే.. నిన్నటి అచ్చంపేట రైతుదీక్ష సభలో రిపీటైనట్లు అనిపించింది. ఓ ప్రజల మనిషి.. మరో ప్రజల నేతను కోరిన కోరిక మేరకు అప్పటికప్పుడు మొదలైందా పాదయాత్ర. తొలిరోజు ఎనిమిది కిలోమీటర్లు సాగిన పాదయాత్ర రెండోరోజూ కొనసాగుతోంది. అవును కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. కొద్దిరోజులుగా తనతో కలిసివచ్చే నాయకులతో రేవంత్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇలా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోనూ ఓ రైతు దీక్ష సభను ఏర్పాటు చేశారు.
Also Read: ఉన్నవాటికే దిక్కులేదు.. మళ్లీ కొత్త పథకాలా..?
ఆ సభలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. అప్పటికప్పుడు పాదయాత్ర నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. సభలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క.. రేవంత్ రెడ్డిని పాదయాత్ర చేయాలని కోరారు. వెంటనే అంగీకరించి అప్పటికప్పుడు అడుగులు ముందుకు వేశారు. తొలిరోజు సాయంత్రం పాదయాత్ర ప్రారంభించి. ఎనిమిది కిలోమీటర్లు నడిచారు. రోడ్డు పక్కన ఓ టెంటు వేసుకుని.. నిద్రపోయారు. ఈ పాదయాత్ర హైదరాబాద్ వరకు కొనసాగుతుంది. రోజుకు పదినుంచి పన్నెండు కిలోమీటర్ల పాటు సాగి.. హైదరాబాద్ శివారులోని సరూర్ నగర్లో భారీ బహిరంగసభ నిర్వహించి ముగించనున్నారు.
Also Read: టీఆర్‌ఎస్ మెతక వైఖరి..: రెచ్చిపోతున్న బీజేపీ
రేవంత్ రెడ్డి నిర్ణయంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయినా ఉత్సాహంగా ఆయన వెంట నడిచారు. పాదయాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే మందస్తు ప్రణాళిక లేకుండా పాదయాత్ర చేయడం కష్టం. అయినా.. రేవంత్ చాలెంజ్ గా తీసుకున్నారు. ఆయనపై సీనియర్ కాంగ్రెస్ లీడర్లు కోపంగా ఉన్నా.. వ్యతిరేకంగా ఉన్నా.. పీసీసీ అధ్యక్షుడు కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నా.. ద్వితీయశ్రేణి నేతల్లో.. క్యాడర్లో ఆయనకు పలుకుబడి చాలా ఉంది. కాంగ్రెస్ కు ఆయన నాయకత్వం కావాలనే ఉంది. దీంతో ఆయనకు మద్దతుగా నిలిచేందుకు చాలా మంది కాంగ్రెస్ ద్వితీయశ్రేణి నాయకులు పాదం కలుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
పీపీసీ అధ్యక్షుడిగా రేవంత్ పేరు ఖరారు అయినా.. అనివార్య కారణాలతో హైకమాండ్ ప్రకటించలేక పోయింది. ఇతర నేతలు ఇక్కడ తిరుగుబాటు చేసి.. పక్కపార్టీలోకి వెళ్లిపోతారని ఆందోళన చెందుతోంది. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది. కొద్దిరోజుల క్రితం ఇక ప్రకటనే ఆలస్యం అని చెప్పుకున్నారు కానీ.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాత అని మాట మార్చారు. కానీ రేవంత్ రెడ్డి తన కార్యాచరణను ఆపలేదు. తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అయితే రేవంత్ పాదయాత్రపైనా హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లడం ఖాయం. కాంగ్రెస్లో ఏం చేయాలన్న హై కమాండ్ అనుమతి తప్పనిసరి. లేకపోతే ఊరుకోరు. ఇప్పుడూ ఇదే జరిగే అవకాశం ఉంది. దీనిపై మాణిగం ఠాకూర్ ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా ఉంది.