
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మార్పు తీసుకురావాలని, నేతలందరూ సమన్వయంతో పనిచేసేలా చూడాలని అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా నాయకులతో ఐక్యంగా పని చేయించడం ఎవరివల్లా కావడం లేదు. రేవంత్ వర్గానికే కొమ్ము కాస్తున్నాడని మాణిక్యం ఠాగూర్‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఆయనను తప్పించిన సీనియర్లు.. కొత్త ఇన్‌చార్జి వచ్చాక కూడా తమ తీరు మార్చుకోవడం లేదు. మేమింతే.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఠాక్రే పార్టీని గాడిలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా సీనియర్లు సహకరించడం లేదు.
Also Read: Botsa Satyanarayana- Jagan: బొత్సకు భయపడుతున్న జగన్
కలిసి ఉంటే కాంగ్రెస్ లీడర్లు ఎందుకవుతారు?
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి పనిచేయాలని ఇన్‌చార్జి ఠాక్రే సీనియర్లకు సూచించినా.. బతిమాలి బామాలి చెప్పినా ఫలితం లేకుండా పోతుంది. కలిసి పనిచేసేవారమైతే తాము కాంగ్రెస్ లీడర్లం ఎందుకవుతాం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అసలు టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. రేవంత్ రెడ్డి పాదయాత్ర సాక్షిగా మరోమారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు చర్చనీయాంశంగా మారాయి.
పాదయాత్రలో సీనియర్లు ఎక్కడ?
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. యాత్రకు సీనియర్ల నుంచి సహకారం ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇప్పటివరకు మల్లు రవి మినహా వేరే సీనియర్ నాయకులు ఎవరు రేవంత్ పాదయాత్రలో పాల్గొనలేదు. రేవంత్ పాదయాత్ర ముగిసేలోపు సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా జాయిన్ అవుతారని పార్టీవర్గాలు చెబుతున్నా రేవంత్ పాదయాత్రలో పాల్గొనడానికి ఎవరూ సుముఖంగా లేరని సమాచారం.
సాకులు చెబుతున్న సీనియర్లు..
పాదయాత్రలో పాల్గొనేందుకు కొంతమంది సీనియర్లు సాకులు చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాలను సాకుగా చూపి ఎంపీలు దూరంగా ఉండగా, ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను సాకుగా చూపుతున్నారట. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిగానీ, సీఎల్పీ నేత భట్టిగానీ ఇప్పటి వరకు పాదయాత్రలో భాగం కాలేదు. ముందు ముందు అవుతారా అంటే అనుమానే అన్న సమాధానం పార్టీ వర్గాల నుంచే వస్తోంది.
ఠాక్రే ప్రయత్నాలు విఫలం..
ఇక రేవంత్‌రెడ్డి పాదయాత్రలో పాల్గొనేది లేదని తాను స్వయంగా పాదయాత్ర చేస్తానంటూ భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. జగ్గారెడ్డి కూడా రేవంత్‌రెడ్డి సంగారెడ్డిలో పాదయాత్ర చేసిన తాను పాల్గొనబోనని స్పష్టం చేశారు. మరోవైపు సీనియర్లకు రేవంత్‌రెడ్డికి మధ్య సమన్వయం కుదరచడానికి పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కావడం లేదు. సీనియర్లు మాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకోలేమని చెబుతున్నారు.

మొత్తంగా రేవంత్‌రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి మద్దతు ఉన్నా ముఖ్య నాయకులు కలిసిరాకపోవడం లోటుగా అనిపిస్తోంది. రేవంత్ పాదయాత్ర చూస్తున్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో అంతే… ఎవరు మారినా.. ఏమి మారినా.. వాళ్లు మారరు అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ‘శత్రువులు ఎక్కడో ఉండర్రా’ అని ఓ సినిమాలు రావు రమేశ్ చెప్పిన∙డైలాగ్‌ను గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు శత్రువులు కాంగ్రెస్‌లోనే ఉన్నారని చర్చించుకుంటున్నారు.
Also Read: Revanth Reddy: ప్రత్యర్థులకు టార్గెట్.. రేవంత్‌రెడ్డి చరిత్ర అలాంటిది మరీ..!!
