Botsa Satyanarayana- Jagan: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో చాలామంది నాయకులు రాజకీయంగా ఎదిగారు. 2003లో పాదయాత్ర చేస్తున్న సమయంలోనే వైఎస్ జిల్లాల వారీగా పట్టున్న నేతలను ఒడిసి పట్టుకున్నారు. దాదాపు ఉమ్మడి ఏపీలో జిల్లాకు ఒకరిద్దరు నాయకులను గుర్తించి వారికి అన్నివిధాలా ప్రోత్సహించారు. దీంతో వారంతా తిరుగులేని నాయకులుగా ఎదిగారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కొంత ఇబ్బందిపడినా.. వైసీపీ ఆవిర్భావంతో తమ నాయకుడు బిడ్డే కదా అని సంతోషపడ్డారు. పార్టీలో చేరారు. కానీ అప్పుడే వారికి చుక్కెదురైంది. నాడు తండ్రి చూపిన అభిమానం, గౌరవం, మర్యాద కుమారుడిలో మచ్చుకైనా కానరాలేదు. అలాగని వెనక్కి తగ్గితే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. దీంతో చాలామంది నైరాశ్యంలోకి వెళ్లారు.
Also Read: Revanth Reddy: ప్రత్యర్థులకు టార్గెట్.. రేవంత్‌రెడ్డి చరిత్ర అలాంటిది మరీ..!!
తన తండ్రితో సమకాలికులు చాలామంది ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి స్థాయిలో గౌరవం దక్కడం లేదన్న టాక్ కూడా ఉంది. ఒక మంచి సలహా ఇచ్చినా జగన్ స్వీకరించే పరిస్థితి లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే సీఎం ను నేరుగా కలవలేని పరిస్థితి. ప్రస్తుతం ఆనలుగురు’ తప్పించి మిగతా సీనియర్లు ఎవరూ కనిపించడం లేదు. దాని పరిణామమే ధిక్కార స్వరాలు. అటు ఇంటా బయటా ఒత్తిడి ఎదురయ్యేసరికి జగన్ కు అసలు విషయం అర్ధమైంది. ఇప్పుడు మర్యాద, మన్నన అన్న మాటలతో సీనియర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడుతున్నారు.
మొన్న ఆ మధ్యన బొత్స సత్యనారాయణ ను జగన్ తెగ మెచ్చుకున్నారు. మంత్రిగా ప్రభుత్వం, పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారంటూ కితాబిచ్చారు. అయితే ఈ హఠాత్ పరిణామంతో మంత్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. జగన్ నోటి నుంచి పొగడ్తలు, గౌరవం అన్న మాటలు వచ్చేసరికి ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం పార్టీలో ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి. ఆనం, కోటంరెడ్డిలాంటి వారు 35 మంది వరకూ ఉన్నట్టు రహస్య సర్వేలో తేలింది. అందులో సీనియర్లే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో జగన్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ నాడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద ఒక ప్రతిపాదన పెట్టారు. కాపులకు సీఎం పదవి ఇవ్వాలని విన్నవించారు. కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో సీఎం పోస్టుకు పావులు కదిపారు. ఇప్పుడదే గుర్తుచేసుకొని బొత్స విషయంలో జగన్ జాగ్రత్త పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే బొత్స నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. పైగా మంత్రివర్గ విస్తరణలో బొత్సకు కేటాయించిన పాఠశాల విద్యాశాఖ పై ఆయన విముఖత చూపినట్టు వార్తలు వచ్చాయి. అందుకే ఇప్పుడు శాఖపరంగా బొత్స పనితీరు బాగుందని జగన్ కితాబిచ్చారు. ప్రస్తుతం పెరుగుతున్న ధిక్కార స్వరాలకు నాయకత్వం వహిస్తారన్న అనుమానంతో బొత్సను కూల్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
Also Read:AP Capital Issue: అమరావతియే ఏపీ రాజధాని.. వైసీపీ ఎలా ముందుకెళ్లనుంది?