https://oktelugu.com/

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి మరో సంచలనం.. ప్రజలకు మరో రెండు గ్యారెంటీలు.. అమలు ముహూర్తం ఇదే

సర్కార్‌కొలువు దీరిన రెండు రోజులకే రెండు గ్యారంటీలను అమలుకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. డిసెంబర్‌ 7న ప్రభుత్వం ఏర్పడగా, డిసెంబర్‌ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 19, 2023 / 12:57 PM IST

    CM Revanth Reddy

    Follow us on

    CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌ను పదేళ్ల తర్వాత అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా మారాయి ఆరు గ్యారంటీలు. తుక్కుగూడ వేదికగా సోనియాగాంధీతో ఈ ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది టీకాంగ్రెస్‌. మరోవైపు 42 పేజీల మేనిఫెస్టో, జాబ్‌ క్యాలెండర్‌ హామీ, పెన్షన్ల పెంపు, రుణమాఫీ, రైతుభరోసా లాంటి హామీలు అన్నివర్గాలను కాంగ్రెస్‌ వైపు మళ్లించాయి. దీంతో 64 సీట్లతో కాంగ్రెస్‌ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్‌రెడ్డి, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్‌ సర్కార్‌ దృష్టిపెట్టింది.

    కొలువు దీరిన రెండు రోజులకే..
    సర్కార్‌కొలువు దీరిన రెండు రోజులకే రెండు గ్యారంటీలను అమలుకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. డిసెంబర్‌ 7న ప్రభుత్వం ఏర్పడగా, డిసెంబర్‌ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించారు. ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ 40 శాతం పెరిగింది. మహిళా ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడుతున్నాయి.

    త్వరలో మరో రెండు గ్యారంటీలు..
    తెలంగాణ ప్రభుత్వం గ్యారంటీల అమలుపై వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా మరో రెండు పథకాల అమలుకు ముహూర్తం నిర్ణయించింది. కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28వ తేదీ ఇందుకు ముహూర్తంగా ఖరారు చేసింది. కొత్త సంవత్సరం కానుకగా ఇవి అమల్లోకిరానున్నాయి.

    పీఏసీలో చర్చ..
    తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశంలోనూ ఆరు గ్యారెంటీలపై చర్చ జరిగింది. భారీ కసరత్తు అవసరం లేకుండా, తక్షణమే ప్రారంభించగలిగే పథకాలు ఏమున్నాయనే అంశంపై గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ పీఏసీలో చర్చించారు. ఇందులో పింఛన్‌ పెంపు, రూ.500 సిలిండర్‌ అమలు చేయాలని నిర్ణయించారు. పార్టీ వ్యవస్థాపక దినమైన డిసెంబరు 28 నుంచి ఈరెండు గ్యారంటీల అమలు ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు.

    ఎక్కువ మందిని ప్రభావితం చేసేలా..
    గ్యారంటీల్లో తక్కువ భారం పడడంతోపాటు ఎక్కువ మందిని ప్రభావితం చేసే పథకాలుగా పెన్షన్, సబ్సిడీ సిలిండర్‌ను గుర్తించారు. వీటిద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి లబ్ధి కలుగుతుందని భావిస్తోంది. ఈ క్రమంలో ‘చేయూత’లో భాగంగా నెలవారీ పింఛన్‌ రూ.4 వేలకు పెంచి ఇవ్వాలన్నదానిపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పింఛను తీసుకుంటున్న లబ్ధిదారుల లెక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రతీనెల 45 లక్షల పైగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ జరుగుతోంది. వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవీ, బోదకాలు బాధితులకు ప్రస్తుతం ఆసరా పింఛను కింద నెలకు రూ.2,016 చొప్పున ఇస్తున్నారు. ఇకపై ఇది రూ.4 వేలు కానుంది. ఇప్పటివరకు నెలకు రూ.900 కోట్ల వరకు ఖర్చవుతుండగా.. పెరిగే పింఛను మొత్తంతో ఇది నెలకు రూ.1,800 కోట్లు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.21,600 కోట్లకు చేరనుంది. దివ్యాంగులకు ప్రస్తుతం రూ.3,016 ఇస్తున్నారు. దీనిని పెంచే విషయమై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

    సబ్సిడీ సిలిండర్‌..
    ఈ నెల 28 నుంచి అమలు ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ గ్యాస్‌ సిలిండర్‌ను రూ.500కే ఇస్తామని ఆరు హామీల్లో పేర్కొంది. సిలిండర్‌ ధర రూ.955 ఉండగా.. ప్రభుత్వం రూ.455 సబ్సిడీ భరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 1.20 కోట్ల వంట గ్యాస్‌ కనెక్షన్లున్నాయి. ఇందులో దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్‌) 89.99 లక్షల మంది ఉన్నారు. వీరికి ఏడాదికి 6 సిలిండర్లకు రాయితీ ఇస్తే ప్రభుత్వంపై రూ.2,225 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. 12 సిలిండర్లు ఇస్తే అది రూ.4,450 కోట్లవుతుంది. కాగా, కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై రూ.40 సబ్సిడీ ఇస్తోంది. మొత్తం డబ్బు చెల్లించి తీసుకున్న తర్వాత ఆ రాయితీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది.