Nara Lokesh Padayatra
Lokesh Padayatra: మీడియా మీడియా తీరుగా ఉండాలి. వ్యాఖ్యాతలు వార్తలను వార్తల్లాగా చదవాలి. పార్టీల జెండాలను మోసే కూలీలుగా మారితేనే చూసేవాళ్ళకు ఇబ్బంది… ప్రస్తుతం ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారం ఇలానే ఉంది. అది అంతిమంగా టిడిపి కి ఎన్నికలకు ముందు ఇబ్బంది కలిగించే విధంగా పరిణమించింది..యువ గళం పేరుతో టిడిపి యువ నాయకుడు లోకేష్ నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు.. సహజంగానే ఆయనకు హైప్ ఇచ్చే పనిని ఓ వర్గం మీడియా నెత్తికెత్తుకుంది.. వార్తల విషయంలో.. ఆయన చేసే ప్రసంగాల విషయంలో వీరవిధేయ పసుపు భక్తిని చాటింది. గంటల కొద్ది లైవ్ ప్రసారం చేయడం.. పేజీల కొద్దీ వార్తలను నింపడం.. వాటి కార్యక్రమాలను ఆ మీడియా చేపట్టింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఓ న్యూస్ ఛానల్ యాంకర్ చేసిన ప్రచారం మరొక ఎత్తు.
లోకేష్ బాబు పాదయాత్ర ప్రారంభించినప్పటి లోకేష్ బాబు పాదయాత్ర ప్రారంభించనప్పుడు నందమూరి కుటుంబంలో అపశృతి చోటుచేసుకుంది. తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వాస్తవానికి ఈ ఘటనకు లోకేష్ కు సంబంధం లేకపోయినప్పటికీ.. లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు బ్రాహ్మండాలు బద్దలవుతున్నాయని ఓ వర్గం మీడియా ప్రచారం చేయడమే అసలు చర్చకు ప్రధాన కారణం. తారకరత్న చివరికి కన్ను మూయడం.. ఆ కుటుంబాన్ని ఇప్పుడు టిడిపి పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. నాడు లోకేష్ పాదయాత్ర కోసమే తారకరత్న వచ్చారని.. తారకరత్న కన్ను మూయడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైపోయిందని.. ఇప్పుడు వారికి ఎవరు అండగా ఉంటారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చివరికి పాదయాత్ర ముగింపు రోజు కూడా లోకేష్ తారకరత్న పేరు ప్రస్తావించకపోవడం పట్ల రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తారకరత్న కుటుంబానికి అండగా ఉంటామని లోకేష్ ఒక మాట మాట్లాడి ఉంటే ప్రజల్లోకి సానుకూల సంకేతాలు వెళ్లి ఉండేవని వారు గుర్తు చేస్తున్నారు.
అయితే లోకేష్ పాదయాత్రకు హైప్ ఇచ్చే క్రమంలో పచ్చ మీడియా కు చెందిన వ్యాఖ్యాత సీనియర్ ఎన్టీఆర్ చరిష్మాను కూడా తగ్గించే ప్రయత్నం చేశారు.. నాడు సీనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహిస్తే తండోపతండాలుగా జనం వచ్చేవారని.. లోకేష్ నిర్వహించిన పాదయాత్రకు అంతకుమించి అనేలాగా జనం వచ్చారని ఆ వ్యాఖ్యాత నొక్కి వక్కాణించడం విశేషం. అయితే ఇదే సందర్భంలో విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. నాడు చంద్రబాబు సీనియర్ ఎన్టీఆర్ కు ఎలా ద్రోహం చేశాడో అందరికీ తెలుసని… అయినప్పటికీ ఆయన ఫోటోతోనే ఇప్పటికీ ఓట్లు అడుగుతున్నారని.. కానీ ఆయన చరిష్మా తగ్గించి.. ఆయన కంటే లోకేష్ గొప్పోడు అనే విధంగా చిత్రీకరించడం ఎంతవరకు న్యాయమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. లోకేష్ ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలని కోరుకోవడంలో తప్పు లేదని.. ఇదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ విలువను తగ్గించడం ఎంతవరకు సమంజసం అని వారు నిలదీస్తున్నారు. అన్నట్టు పచ్చ మీడియా వ్యాఖ్యత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నది. బహుళ ప్రజాదరణ పొందిన సినిమా వీడియోలను మధ్యలో కూర్చి తెగ ట్రోల్ చేస్తోంది.. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.