Revanth Reddy- KCR: ప్రతీ స్త్రీకి పుస్తెల తాడు ఎంతో పవిత్రమైనది. పచ్చని తోరణాలు… అగ్నిసాక్షి మంత్రాలు.. ఇరు కుటుంబాలు.. వేల మంది అతిథుల మధ్య ఓ వ్యక్తితో ఆ మహిళ తన మెడలో తాళిబొట్టు వేయించుకుంటుంది. ఈ తాళి ఎంత పవిత్రంగా కాపాడుకుంటే జీవితం అంత సుభిక్షంగా ఉంటుందని ఆ సమయంలో అర్చకులు చెబుతారు. ఒక్కసారి మహళ మెడలో పుస్తెల తాడు పడిందంతే ఆమెకు కొత్త జీవితం ప్రారంభమైనట్టే..తన జీవితాన్నే మార్చే తాళిబొట్టును తన ప్రాణం పోయే వరకు మెడలోనే ఉంచుకుంటుంది. కానీ ఇప్పుడు ఆ పవిత్రమైన పుస్తెల తాడును సీఎం కేసీఆర్ చర్యలతో తీయాల్సి వచ్చింది. చేసిన అప్పులకు వడ్డీల కోసం తాళిబొట్టును అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందని ఓ మహిళా సర్పంచ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆమె చేసిన వ్యాఖ్యలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ కేసీఆర్ తీరును ఎండగట్టారు. ఆ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.
గత కొన్ని రోజులుగా తమకు చేసిన పనులకు బిల్లులు రావడం లేదని సర్పంచ్ లు ఆందోళన చేస్తున్నారు. గ్రామాల్లో తమ జేబుల్లోని డబ్బులను పెట్టి అభివృద్ధి పనులు చేయించామని, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆ బిల్లులు రాక ఆందోళన చెందుతున్నారు. కొందరు ఈ బిల్లులు రాకపోవడంతో కాయ కష్టం చేస్తున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. అప్పటి వరకు కుర్చీలో కూర్చున్న వారు కూలీలుగా మారిపోతున్నారు. అక్కడా.. ఇక్కడా.. అని కాదు తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. దీంతో ఇక ఒపిక నశించిన సర్పంచ్ లు ఆందోళన బాట పట్టారు. నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీరి దీక్షలు తెలంగాణ కాంగ్రెస్ మద్దతు పలుకుతోంది.
Also Read: Rajendra prasad- Anchor Manjusha: నటుడు సీరియస్.. అలిగి వెళ్లిపోయిన యాంకర్ మంజూష
ఇంతలో పల్లెప్రగతి కోసం తాము చేసిన పనులకు ఇంత వరకు బిల్లులు రాలేదని ఓ మహిళా సర్పంచ్ పడిన ఆవేదన చర్చనీయాంశంగా మారింది. నల్గగొండ జిల్లా మర్రిపల్లి గూడెం ఎరుగుండ్ల సర్పంచ్ మాడెం శాంతమ్మ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గత ఏడాది పల్లె ప్రగతిలో భాగంగా తమ గ్రామంలో చేసిన పనులకు బిల్లులు రాలేదు. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగాయి. విధిలేని పరిస్థితుల్లో తన పుస్తెలతాడును అమ్మేసి వడ్డీలు కట్టానని ఆవేదన చెందింది. మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో ‘పల్లె ప్రగతి’ సమీక్ష సమావేశంలో ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సంచలనంగా మారింది. దీంతో అక్కడున్న సర్పంచ్ లు సమావేశాన్ని బహిష్కరించారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, ఇతర పనులకు అప్పులు తెచ్చామని, ఇప్పుడు వాటికి వడ్డీ కట్టలేకపోతున్నాని మిగతా సర్పంచ్ లు తమ కష్టాన్ని చెప్పుకున్నారు.
అయితే ఈ న్యూస్ ను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ‘ఆడబిడ్డలకు పుస్తెల తాడు ప్రాణ సమానం. ఊరికి ఉపకారం చేసిందనుకు ఆ తాళినే అమ్మి వడ్డీలు కట్టించే పరిస్థితి తెచ్చిన దౌర్భాగ్యుడు కేసీఆర్. టీఆర్ఎస్ పాలనలో పల్లెల దుర్ఘతికి ఇదే నిదర్శనం’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్టు వైరల్ గా మారింది. గ్రామాల్లో మిగతా సర్పంచులు కూడా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇన్నాళ్లు ఎప్పుడో ఒకప్పుడు బిల్లులు వస్తాయని అనుకున్న సర్పంచ్ లు ఇప్పటికీ రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఇవే కాకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రత్యేక నిధుల ఇస్తామన్న హామీ నిరుగారిపోయింది.
మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో సర్పంచ్ లు ఇలా ఆందోళన బాట పట్టడంతో టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. మొన్న రెడ్ల సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ని తరిమిన సంఘటన మరువకముందే ఓ మహిళా సర్పంచ్ ఇలా వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా మంత్రులెవరూ స్పందించడ లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై ఇలాగే విమర్శలు కొనసాగితే పార్టీకి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ లోని కొందరు చర్చించుకుంటున్నారు.
Also Read:Attack On Mallareddy: మల్లారెడ్డిపై దాడి: కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకత వల్లేనా?