Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. నేతలు మాటలు తూలుతున్నారు. రెండు రోజుల క్రితం ప్రచార సభకు వచ్చిన యువకులను సీఎం కేసీఆర్ దుర్భాషలాడారు. ఒకే రోజు మూడు సభల్లో మాట తూలారు. సభికులను తూలనాడారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఆదే బాటలో నడుస్తున్నారు. మొన్నటి వరకు సొంత పార్టీ నాయకులపై చేయి, కాలు చేసుకున్న రేవంత్ ఇప్పుడు సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, మీడియాపై బూతుపురాణం అందుకున్నారు.
యువకులు అడవి బాట..
ఈసారి తెలంగాణలో గెలవకపోతే హైదరాబాద్ అమరావతి అవుతుందని బీఆర్‌ఎస్ మత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రచారం చేస్తుండగా, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈసారి కాంగ్రెస్ గెలవకపోతే యువత అడవిబాట పడతారని హెచ్చరించారు. నక్సలైట్లుగా మారి ప్రభుత్వంపై తిరగబడతారని తెలిపారు. అప్పుడు ఒక్కడు కూడా మిగలడని పేర్కొన్నారు.
ప్రగతిభవన్ పేల్చేస్తామని..
గతంలో బండి సంజయ్ కొత్త సచివాలయం మాడల్‌ను తప్పు పట్టారు. తాము వచ్చాక మసీదును పోలిన గుమ్మటాలు తొలగిస్తామని చర్చకు తెరలేపారు. ఇప్పుడు ఎన్నికల వేళ టీపీసీసీ చీఫ్ ప్రగతిభవన్‌ను టార్గెట్ చేశారు. ప్రజలకు అనుమతి లేని ప్రగతిభవన్ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్‌ను పేల్చేస్తామని తెలిపారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండాల్సింది అదే భవన్‌లో అలాంటప్పుడు ఎలా కూల్చివేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.
కేసీఆర్ తల నరకాల్సిందే..
ఇక కేసీఆర్ టార్గెట్‌గా రేవంత్ ప్రచారం సాగుతోంది. శిశుపాలుడు వంద తప్పులు చేసిన తర్వాత విష్ణుమూర్తి తన విష్ణుచక్రంతో తల నరికాడని, ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయని రేవంత్ వెల్లడించారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఎన్నికల్లో కేసీఆర్ తల నరకాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించారు.
మీడియాపై దురుసుగా..
ఇక రేవంత్ మీడియాను కూడా దుర్భాషలాడారు. తమకు అనుకూలంగా రాయడం లేదనో.. లేక వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయనో అసహనంతో నోరు పారేసుకున్నారు. అధికారంలోకి వచ్చాకా మీడియాను పండబెట్టి తొక్కుతానని హెచ్చరించారు. సంయమనంతో ఉండాల్సిన మీడియా ఏకపక్షంగా వార్తలు, కథనాలు ప్రసాచం చేయడంపై అసహంన వ్యక్తం చేశారు.
కేసీఆర్ తల్లిపై..
కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ తల్లిని కూడా రేవంత్ దుర్భాషలాడారు. కేసీఆర్ కామారెడ్డికి వచ్చి.. తన అమ్మమది కోనాపూరని, మా అమ్మ అక్కడే పుట్టింది అని కేసీఆర్ చెప్పిన మాటలను తప్పు పట్టారు. నిజంగా కోనాపూర్‌లో మీ తల్లి పుట్టి ఉంటే.. ఆ తల్లికే నువ్వు పుట్టి ఉంటే..అంటూ నోరు జారారు.
ఎన్నికల వేళ సంయమనంతో వ్యవహరించాల్సి నేత ఇలా నోరుజారడం, చేయి చేసుకోవడం, దుర్భాషలాడడం పై విమర్శలు వ్యక్తమవుతన్నాయి. సహనంతో, సంయమనంతో ప్రచారం చేయలని నెటిజన్లు సూచిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇలాంటి తీరుతో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న వాతావరణం చెడిపోతుందని, వ్యతిరేకత పెరుగుతుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.