Revanth Reddy Vs KTR: అటు రేవంత్.. ఇటు కేటీఆర్…పవర్ పాలిటిక్స్

వాస్తవానికి భారత రాష్ట్ర సమితి ఎప్పుడూ లేని విధంగా సైలెంట్ అయిపోయింది. ప్రతిపక్షాలు ఏదైనా విమర్శ చేస్తే ఒంటి కాలు మీద లేచే ఆ పార్టీ నాయకులు ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించడం ఒకింత ఆసక్తికరంగా మారింది. క్షేత్రస్థాయి పరిస్థితుల ప్రకారం ప్రభుత్వం 24 గంటల పాటు విద్యుత్ ప్రసారం చేయకపోవడం వల్లే సైలెంట్ గా ఉండిపోవాలని ఆదేశాలు ఇచ్చిందని.

Written By: Bhaskar, Updated On : July 17, 2023 12:20 pm

Revanth Reddy Vs KTR

Follow us on

Revanth Reddy Vs KTR: తెలంగాణలో ఉచిత విద్యుత్ పై తానా మహాసభల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా మంట పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉండడంతో అటు భారత రాష్ట్ర సమితి, ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ యుద్ధంలో అటు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, ఇటు భారత రాష్ట్ర సమితి నుంచి కేటీఆర్ మాత్రమే మాట్లాడుతుండడం విశేషం.

అధికార ప్రతినిధులు ఉన్నప్పటికీ..

సాధారణంగా భారత రాష్ట్ర సమితికి సంబంధించి అధికార ప్రతినిధులు ఉన్నారు. న్యూస్ చానల్స్ నిర్వహించే చర్చావేదికలకు వీరు వెళుతుంటారు. ప్రభుత్వానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ ఆరోపణ చేస్తే వారు విలేకరుల సమావేశం నిర్వహించి కౌంటర్ ఇస్తారు. భారత రాష్ట్ర సమితిలో మొన్నటి వరకు కూడా ఇదే జరిగింది. అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కరెంట్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారో అప్పుడే ఒక్కసారిగా పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ప్రగతి భవన్ ఆదేశాల మేరకు కేవలం కేటీఆర్ మాత్రమే మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా హరీష్ రావు, ఇతర మంత్రులు మాట్లాడినప్పటికీ ఎందుకో వారు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.. కేటీఆర్ కూడా ప్రతి సమావేశంలోనూ అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు రేవంత్ రెడ్డిని కౌంటర్ చేసి మాట్లాడుతున్నారు.

ఎందుకు ఇంత మార్పు?

వాస్తవానికి భారత రాష్ట్ర సమితి ఎప్పుడూ లేని విధంగా సైలెంట్ అయిపోయింది. ప్రతిపక్షాలు ఏదైనా విమర్శ చేస్తే ఒంటి కాలు మీద లేచే ఆ పార్టీ నాయకులు ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించడం ఒకింత ఆసక్తికరంగా మారింది. క్షేత్రస్థాయి పరిస్థితుల ప్రకారం ప్రభుత్వం 24 గంటల పాటు విద్యుత్ ప్రసారం చేయకపోవడం వల్లే సైలెంట్ గా ఉండిపోవాలని ఆదేశాలు ఇచ్చిందని.. పేరు రాసేందుకు ఇష్టపడని ఓ భారత రాష్ట్ర సమితి నాయకుడు పేర్కొన్నారు.”వ్యవసాయానికి కేవలం 12 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తున్నాం. ఇలాంటప్పుడు సాగుకు 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నామని ఎలా చెప్పుకుంటాం? మరోవైపు వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను రైతులకు వివరించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. క్షేత్రస్థాయిలో ఇన్ని సమస్యలు పెట్టుకొని రైతు పక్షపాతి అని మేము ఎలా చెప్పుకోవాలి” అని భారత రాష్ట్ర సమితి నాయకులు అభిప్రాయపడుతున్నారు. బహుశా ఇలాంటి సమాచారం కెసిఆర్ వద్ద ఉన్నది కాబట్టే ఆయన కేవలం కేటీఆర్ ను మాత్రమే మాట్లాడాలని సూచించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇక ప్రగతి భవన ఆదేశాల మేరకు కేటీఆర్ కూడా ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీలో గాడ్సే జొరబడ్డాడని కీలక విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలు జనాలకు అంతగా రీచ్ కావడం లేదని భారత రాష్ట్ర సమితి నాయకులు అంతర్గతంగా అభిప్రాయపడుతున్నారు.

అటు కాంగ్రెస్ పార్టీలోనూ..

ఇక విద్యుత్ కు సంబంధించి చేసిన వ్యాఖ్యల పట్ల రేవంత్ రెడ్డి మాత్రమే సమాధానం ఇస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన వరుసగా మూడు ప్రెస్ మీట్ లు నిర్వహించారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నప్పటికీ ఎవరు కూడా సంఘీభావంగా మాట్లాడలేదు. పోరెడ్డి అయోధ్య రెడ్డి వంటి వారు మాట్లాడినప్పటికీ మీడియా అంతగా ప్రముఖంగా తీసుకోలేదు. ఇక ఇది చాలదన్నట్టు ఉచిత విద్యుత్ పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రేవంత్ రెడ్డి ఏకంగా రైతులకు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఉచిత విద్యుత్ అంశానికి సంబంధించి చేసిన విమర్శలపై అటు భారత రాష్ట్ర సమితి నుంచి కేటీఆర్, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి మాత్రమే మాట్లాడుతుండడం, సై అంటే సై అని సవాళ్లు విసురుకుంటుండడం తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ.. కీలక నేతలిద్దరూ ఇలా విమర్శలు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది