NTV Narendra Chaudhary: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి అక్కడి ప్రతిపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. వాలంటీర్లు కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. వాలంటీర్ల వైపు అధికార వైఎస్ఆర్సిపి నిరసన ప్రదర్శనలు చేస్తోంది. ఇటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో న్యూట్రల్ గా ఉండాల్సిన మీడియా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులను చూపించాల్సిన మీడియా కట్టు తప్పుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాలంటీర్ల వైపు ఎన్టీవీ నిలబడటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అవి తెలుసుకున్నారా
వాస్తవానికి పవన్ కళ్యాణ్ వాలంటీర్లు అందర్నీ కలిపి అనలేదు. కొందరి వల్ల ఆ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక కూడా బలమైన కారణాలే ఉన్నాయి. వాలంటీర్లు కొంతమంది అనైతిక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కొంత మంది చట్ట వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడినట్టు ఆధారాలతో సహా రుజువయ్యాయి. వీటిని కారణాలుగా చూపిస్తూ పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్లు సేకరిస్తున్నారని, వాటిని అధికార వైఎస్ఆర్సిపి వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నదని పవన్ కళ్యాణ్ అసలు విషయాలను బయటపెట్టారు. దీంతో అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మంచి రసకందాయంలో పడ్డాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడిని పుట్టిస్తున్నాయి. అయితే ఇలాంటప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రతిబింబించాల్సిన మీడియా ఒకవైపు వకల్తా పుచ్చుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఎన్టీవీ చైర్మన్ ఏం చెప్పారంటే
వర్తమాన రాజకీయ అంశాలపై నెంబర్ వన్ న్యూస్ ఛానల్ గా వెలుగొందుతున్న ఎన్ టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి.. చైర్మన్ డెస్క్ పేరుతో తన వాణి చెబుతుంటారు. సరే దీనిపైన ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఏపీలో రాజకీయంగా చర్చకు దారి తీస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై నరేంద్ర చౌదరి సానుకూలంగా మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు పాల్పడిన అనైతిక కార్యకలాపాల గురించి తన చానల్లో ఆయన ఒక వార్త కూడా ప్రసారం చేయలేదు. పైగా వాలంటీర్ల వ్యవస్థ అనేది గేమ్ చేంజర్ ఆయన ప్రకటించడం విస్తు గొలుపుతోంది. వాలంటీర్లు ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ పథకాలను చేరువ చేస్తున్నారని ఆయన ప్రకటించడం విశేషం. కాగా ఎన్ టీవీ చైర్మన్ చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది..”ప్యాకేజీ ముట్టింది కాబట్టి జగన్ కు అనుకూలంగా ఎన్టీవీ నరేంద్ర చౌదరి మాట్లాడుతున్నారని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.