https://oktelugu.com/

Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట.. అయినప్పటికీ జైల్లోనే..

గత నెల 28న సూర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగించాలని పిటిషన్ దాఖలు చేశాడు. దానిని న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సమస్య మా చేతిలో లేదంటూ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పరిపాలన విషయాలలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు పిటిషనర్ కు విన్నవించింది.

Written By: , Updated On : April 4, 2024 / 10:11 PM IST
Arvind Kejriwal send to judicial custody till April 15

Arvind Kejriwal send to judicial custody till April 15

Follow us on

Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటూ అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను.. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలనే ప్లాన్ బెడిసి కొట్టింది. ఆయనకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసేందుకు ఓ వ్యక్తి ముందుకు వచ్చారు.. దానిని స్వీకరించేందుకు న్యాయస్థానం ఒప్పుకోలేదు. అంతేకాదు ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలా? వద్దా? అనేది అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయమని కోర్టు ప్రకటించింది. “ఈ విషయంపై రాజ్యాంగ నిపుణులను మీరు సంప్రదించాలి. కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనం అనేది జాతీయ ప్రయోజనాల పరిమితికి లోబడి ఉండాలి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా? వద్దా? అనేది అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఉంది. రాష్ట్రపతి లేదా గవర్నర్ పరిపాలనను కోర్టులు ఎప్పుడైనా విధించాయా? అలాంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా?” అని న్యాయస్థానం ఫిర్యాదుదారుడిని అడిగింది.

తీహార్ జైల్లో విచారణ ఖైదీగా అరవింద్ కేజ్రీవాల్ కొద్దిరోజులుగా ఉంటున్నారు. ఆయనను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త విష్ణు గుప్త ఇటీవల ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు చేశారు. దానిని స్వీకరించినందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో విష్ణు గుప్తా తన ఫిర్యాదును లెఫ్టినెంట్ గవర్నర్ ఎదుట దాఖలు చేస్తానని పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో అభియోగాలు మోపుతూ గత నెల 21న అరవింద్ కేజ్రివాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఢిల్లీలో పరిపాలన గాడి తప్పింది. అందువల్లే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవలసిన అవసరం ఉందని విష్ణు గుప్తా తరపు న్యాయవాది పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతిని సంప్రదించాలని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. ” ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం సక్రమంగా పనిచేయడం లేదని మేము ఎలా చెబుతాం? దానిని చెప్పడానికి లెఫ్టినెంట్ గవర్నర్కు పూర్తి అధికారం ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్ కు పూర్తిస్థాయిలో సమర్ధత ఉంటుంది. ఆయనకు మా గైడ్లైన్స్ అవసరం లేదు. చట్టానికి లోబడి లెఫ్ట్నెంట్ గవర్నర్ పని చేస్తారు” అని పేర్కొంటూ విష్ణుగుప్త పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసి పుచ్చింది. ఫలితంగా అరవింద్ కేజ్రీవాల్ కు స్వల్ప ఊరట లభించినట్టయింది.

ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు కావడం ఇది రెండవసారి. గత నెల 28న సూర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగించాలని పిటిషన్ దాఖలు చేశాడు. దానిని న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సమస్య మా చేతిలో లేదంటూ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పరిపాలన విషయాలలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు పిటిషనర్ కు విన్నవించింది. ఢిల్లీ హైకోర్టు నుంచి ఊరట లభించినప్పటికీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది.