Puvvada on Polavaram: ఆంధ్రప్రదేశ్ గోదావరిపై నిర్మిస్తున్న భారీ సాగునీటి ప్రాజెక్టు పోలవరం. అనేక వివాదాల మధ్య ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రమే తీసుకుంది. ఏళ్లుగా సాగుతున్న పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. అయితే ఇన్నాళ్లూ ప్రాజెక్టు నిర్మాణంపై ఎలాంటి వివాదాలు లేవు. ఇటీవల కురిసిన భార వర్షాలు, గోదావరికి వచ్చిన వరదలు ఇప్పుడు చిచ్చురేపుతున్నాయి. దీనికి తెలంగాణ రవాణాశాఖ మంత్రి ఆజ్యం పోశారు. దీంతో ఇప్పుడు రెండు రాష్ట్రాల అధికార పార్టీల మధ్య పోలవరం.. రణం రాజేస్తున్నాయి.
నిన్న క్లౌడ్ బరస్ట్.. నేడు పోలవరం ఎత్తు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కురిసిన వర్షాలకు క్లౌడ్ బరస్ట్ కారణమని, దీని వెనుక విదేశీ కుట్ర ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారమే లేపాయి. కేసీఆర్ ఏది మాట్లాడినా దానికి తందానా అంటూ ప్రెస్‌మీట్లు పెట్టే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు.. క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యల విషయంలో మాత్రం కేసీఆర్‌కు అండగా నిలవలేదు. అసహజ వర్షాలే అయినా.. అధిక వర్షాలు కురవడం వెనుక విదేశీ కుట్ర ఉందని కేసీఆర్ పేర్కొనడాన్ని సొంతపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులే నమ్మలేదన్న విషయం తేటతల్లమైంది. మరోవైపు ప్రతిపక్షాలు కాళేశ్వరం మోటార్లు మునిగిపోయిన విషయాన్ని కప్పిపుచ్చేందుకే కేసీఆర్ ఇలా క్లౌడ్ బరస్ట్ అంటూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి.
Also Read: Dubai Law: కేటీఆర్ నగదు సహాయం చేసినా దుబాయ్ ప్రభుత్వం ఒప్పుకోలేదు
తాజాగా తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ గోదావరి వరదలతో భద్రాచలంలోపాటు పలు గ్రామాలు నీట మునగడానికి పోలవరమే కారణమని మరో సంచలన ఆరోపణ చేశారు. పోలవరం ఎత్తు ఎక్కువగా నిర్మించడంతోనే నీరు టెంపుల్ సిటీ భద్రాచలంతోపాటు అనేక గ్రామాలను గోదావరి ముంచెత్తిందని ఆరోపించారు. ‘పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడంలో కొంత నిర్లక్ష్యం చేసినందువల్లే భద్రాచలం వద్ద వరద ఉ«ధృతి పెరిగింది. ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మొదటినుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రాలో విలీనం చేసిన ఐదు గ్రామాలను తిరిగి మాకు ఇవ్వాలి. ఈమేరకు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలి. గోదావరి వరదల నుంచి టెంపుల్ సిటీ భద్రాచలాన్ని కాపాడాలి. పోలవరం టెంపుల్ సిటీకి శాపంగా మారింది’ అని అన్నారు. పువ్వాడ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరద రాజకీయాలపై అసహనం..
గోదావరి వరదలను తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ రాజకీయం చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు. పోలవరం నిర్మాణం పూర్తిగా శాస్త్రీయంగా జరుగుతోందని తెలిపారు. ప్రాజెక్టుకు అన్నిరకాల అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. అశాస్త్రీయ ఆరోపణలతో రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టొద్దని సూచించారు. ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలన్న పువ్వాడ డిమాండ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఐదు రాష్ట్రాలను కలపడం ఎందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తెలంగాణలో విలీనం చేయండి అని అన్నారు. రాష్ట్ర విభజనతో తాము హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని కోల్పోయామని, ఆంధ్రాకు ౖహె దరాబాద్ ఆదాయంలో వాటా ఇస్తారా అని ప్రశ్నించారు. వరదల సమయంలో బాధితులకు సాయం చేయాలిగాని, ఇలా రాజకీయాలు చేయడం తగదని విమర్శించారు. మరోవైపు ఎంపీ వంగా గీత కూడా పువ్వాడ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కేవలం రాజకీయాల కోసమే తెలంగాణ మంత్రి ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ఆంధ్రాకు వరమని అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదని సూచించారు. మొత్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా, వరద ప్రభావం, నష్టం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలా మాట్లాడుతున్నట్లు అనుమానం వస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read:Pawan Kalyan New Look: అభిమానులను భయపెడుతున్న పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్